అవి ‘మనీ’ సినిమా తీస్తున్న రోజులు. ఆ రోజుల్లో ఆర్జీవీ అంటే విపరీతమైన డిమాండ్ ఉండేది. అలాంటి డైరెక్టర్ సినిమాలో నటించాలి అని మహా మహా నటులు కూడా ఆసక్తిగా ఉండేవారు. కానీ ఆర్జీవీకి మాత్రం ఆ సమయంలో ఏ నటుడు దొరకలేదు, కారణం.. హిందీలో ఓ లీడింగ్ యాక్టర్ ను తీసుకోవాలనేది ఆర్జీవీ ఆలోచన. కాకపోతే డేట్స్ కుదరలేదు. ఇప్పుడు ఈ పాత్రకు ఎవరైతే బాగుంటారు అంటూ ఆలోచిస్తున్నాడు వర్మ.
కట్ చేస్తే.. ‘కోటగారు, ఒకసారి అఫీస్ కి రండీ’ అనే వర్మ మాట వినగానే, కోట పరుగులు మీద వర్మ ముందు వాలిపోయాడు. ఫలానా క్యారెక్టర్ మీరు చేస్తున్నారు అంటూ వర్మ చెప్పి షాట్ పెట్టడానికి వెళ్లారు. కోటకు సీన్ పేపర్ ఇవ్వలేదు. సహజంగా రామ్ గోపాల్ వర్మ సినిమాల్లో స్క్రిప్ట్ పుంఖానుపుంఖాలుగా డిటైల్డ్ గా రాయడం లాంటివి ఉండవు. వర్మ తన ఆలోచనలను అసిస్టెంట్లకు చెప్పి వదిలేస్తారు.
ఆ అసిస్టెంట్స్ కి అర్ధం అయితే ఓకే, లేకపోతే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. వచ్చిన ఆర్టిస్ట్ కి సరిగ్గా సీన్ అర్ధం కాక, కరెక్ట్ గా యాక్ట్ చేయలేక నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రస్తుత కోట పరిస్థితి కూడా అదే. ఆర్జీవీ యాక్షన్ చెప్పడానికి రెడీగా ఉన్నాడు. కోట తనకు మ్యాటర్ అర్ధం కాలేదు అని ఇప్పుడు చెప్తే.. ఆర్జీవీ ప్యాకప్ చెప్పేసి సైలెంట్ గా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అందుకే కోట ఆలోచించి తనకు తోచిన నాలుగు మాటలు మాట్లాడి డిఫరెంట్ డిఫరెంట్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తూ మొత్తానికి ఎలాగోలా షూట్ ను పూర్తి చేశాడు. విచిత్రంగా వర్మకి అది బాగా నచ్చింది. సీన్ అర్ధం కాక కోట నోటికొచ్చినట్టు చెప్పిన ‘భద్రం బీకేర్‌ఫుల్ బ్రదరూ..’ అనే మాట అర్జీవికి బాగా నచ్చింది. దాంతో ఆ మాటనే పెట్టి గొప్ప పాట రాయించాడు ఆర్జీవీ.
అయితే ఈ సినిమా ప్రివ్యూ చూసిన వారిలో చాలామంది కోట ట్రాక్ బాగాలేదు. ముఖ్యంగా ఆ పాట బాగోలేదు, సినిమాకి నష్టం జరుగుతుంది, కాబట్టి తీసేయండి అంటూ వర్మకు చాలామంది చెప్పారట. కానీ వర్మకి అవే బాగా నచ్చాయి, సో.. ఉంచాడు, తీరా అవి ఇప్పటికీ జనానికి నచ్చుతూనే ఉన్నాయి.