Homeఎంటర్టైన్మెంట్‘బ‌ద్రి’ని గుర్తు చేసుకున్న రేణుదేశాయ్.. ఎమోషనల్ ట్వీట్!

‘బ‌ద్రి’ని గుర్తు చేసుకున్న రేణుదేశాయ్.. ఎమోషనల్ ట్వీట్!


తొలి సినిమా ఎవ‌రికైనా ప్ర‌త్యేకమే. కానీ.. రేణుదేశాయ్ కు ఉన్నంత ఎమోష‌న్ మ‌రెవ్వ‌రికీ ఉండ‌క‌పోవ‌చ్చు. మ‌రెవ్వ‌రి జీవితంలోనూ అంత‌టి ప్ర‌త్యేక‌త రాక‌పోవ‌చ్చు. ఈ చిత్రంతో ఆమెకున్న బంధం అలాంటిది. 2000 సంవ‌త్స‌రం ఏప్రిల్ 20వ తేదీన బ‌ద్రి మూవీ రిలీజైంది. ఈ చిత్రం విడుద‌లై 21 ఏళ్లు పూర్తిచేసుకున్న‌ సంద‌ర్భంగా ఆమె గ‌త జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకున్నారు. ఈ మేర‌కు సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు రేణు.

18 సంవ‌త్స‌రాల యువ‌తిగా ఉన్న‌ప్పుడు ‘బ‌ద్రి’ చిత్రంతో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టారు రేణుదేశాయ్. ఆమె మొద‌టి సినిమా అదే. అంతేకాదు.. తొలి చిత్రంతోనే బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. ఆ త‌ర్వాత నిజ జీవితంలో అదే హీరోను పెళ్లి కూడా చేసుకుంది. చివ‌ర‌కు విషాదంగా ఇద్ద‌రూ విడిపోయారు కూడా.

యాదృశ్చికం ఏమంటే.. ఆ సినిమాలో కూడా మొద‌ట హీరోను ప్రేమించింది, పెళ్లి చేసుకోవాల‌నుకునేది రేణు మాత్ర‌మే. కానీ.. అనూహ్యంగా వారి జీవితంలోకి మ‌రో యువ‌తి వ‌చ్చి చేరుతుంది. ఈ సినిమా త‌ర‌హాలోనే.. నిజ జీవితంలోనూ అదే ప‌రిస్థితి ఎదుర‌వ‌డం బాధాక‌రం.

ఇన్ని ఆనందాలు.. విషాదాలు త‌న జీవితంతో ముడిప‌డి ఉన్నాయి కాబ‌ట్టే.. ఈ చిత్రంతో ఎమోష‌న‌ల్ గా క‌నెక్ట్ అయిన‌ట్టున్నారు రేణు. ఈ చిత్రం 20 సంవ‌త్స‌రాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా గ‌తేడాది కూడా పోస్టు చేశారు. ఇప్పుడు మ‌రోసారి గుర్తు చేసుకున్నారు.

బ‌ద్రి సినిమాలోని అన్ని పాటలూ సూపర్ హిట్టే. అయితే.. ‘హే చికితా..’ పాట మాత్రం యువతను ఉర్రూతలూగించింది. ఈ పాట షూట్ సంద‌ర్భంగా తీసిన ఓ ఫొటోను షేర్ చేశారు. అందులో రేణుతో పాటు పవన్ కల్యాణ్ కూడా ఉన్నారు. తనముఖానికి దుపట్టా కప్పుకొని ఉన్నారు రేణు.

ఈ ఫొటోకు తనదైన క్యాప్షన్ ఇచ్చారు. కేవ‌లం త‌న గురించి మాత్ర‌మే కామెంట్ రాసుకోవ‌డం గ‌మ‌నార్హం. ‘నా దుపట్టానే నా సన్ స్క్రీన్’ అంటూ కామెంట్ జతచేశారు. ఈ ఫొటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు కూడా నాటి సినిమా విశేషాల‌ను గుర్తు చేసుకుంటూ కామెంట్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CN4LaX0hRtB/

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular