Ravi Teja Mass Jathara : మాస్ మహారాజా రవితేజ సినిమా వస్తుందంటే ఒకప్పుడు థియేటర్ల దగ్గర సందడి ఉండేది. అభిమానుల్లో, ప్రేక్షకుల్లో ఒకరకమైన ఉత్సాహం కనిపించేది. కానీ గత కొంతకాలంగా ఆ హైప్ పూర్తిగా తగ్గిపోయిందనేది టాలీవుడ్‌లో వినిపిస్తున్న మాట. రవితేజ తాజా చిత్రం ‘మాస్ జాతర’ విషయంలో అయితే ఈ పరిస్థితి మరింత స్పష్టంగా కనిపిస్తోందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఈ సినిమా ఎప్పుడో మొదలుపెట్టి అనేక అడ్డంకులు, ఆలస్యాల తర్వాత పూర్తి చేసినట్టు సమాచారం. అయితే, విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ వైపు నుంచి ప్రమోషన్ సందడి ఏమాత్రం లేకపోవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
* ప్రచారానికి పీఆర్ టీం దూరం: కారణం అదేనా?
సాధారణంగా ఏ సినిమాకైనా విడుదలకు ముందు భారీగా ప్రచారం చేస్తారు. కానీ, ‘మాస్ జాతర’కు సంబంధించి కనీసం పీఆర్ (పబ్లిక్ రిలేషన్స్) టీం కూడా చురుగ్గా పనిచేయడం లేదనేది ఇన్సైడ్ టాక్. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా ఆడదని, ప్రమోషన్ కోసం డబ్బులు పెట్టడం దండగ అని భావించి, కనీసం యాడ్స్ ఇవ్వడానికి కూడా వెనకాడుతున్నారని టాలీవుడ్‌లో ఓ ప్రచారం బలంగా వినిపిస్తోంది.
* టీంకే నమ్మకం లేదా? ‘రొట్ట’ సినిమానేనా?
రవితేజ సినిమాలు ఇటీవల ఆశించిన స్థాయిలో ఆడకపోవడం, కథలు రొటీన్‌గా ఉండడంపై విమర్శలు వచ్చాయి. తాజాగా ‘మాస్ జాతర’ కూడా మరో రొటీన్ సినిమానే అవుతుందని, అందుకే చిత్ర యూనిట్ సభ్యులకే ఈ సినిమాపై నమ్మకం లేదని సినీ వర్గాల్లో గాసిప్పులు షికారు చేస్తున్నాయి.
* మళ్లీ అదే పోలీస్ కథేనా?
‘మాస్ జాతర’లో రవితేజ రైల్వే పోలీస్ పాత్ర పోషిస్తున్నారని తెలుస్తోంది. గతంలో వచ్చిన ‘రామారావు ఆన్ డ్యూటీ’ వంటి చిత్రాలలో రవితేజ పోలీస్ పాత్రలు పోషించినప్పటికీ, అవి అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దీంతో , ‘మాస్ జాతర’ కూడా పాత చింతకాయ పచ్చడిలాంటి కథే అని, రవితేజ గత చిత్రాలన్నింటినీ కలిపి కొట్టినట్టుగా ఈ సినిమా కథాకథనాలు ఉంటాయని, అందుకే పీఆర్ టీం పబ్లిసిటీకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆనోట ఈనోట యాడ్స్ కోసం వెళ్లిన వారి దగ్గర నుంచి ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది.
మరి, ప్రచారానికి దూరంగా ఉన్నప్పటికీ ‘మాస్ జాతర’ ప్రేక్షకుల మన్నన పొందుతుందా లేదా అనేది సినిమా విడుదలయ్యాకే తెలుస్తుంది. ఈ గాసిప్పులన్నీ నిజం కాదని నిరూపించాలంటే, సినిమా కంటెంట్ మాత్రమే సమాధానం చెప్పాలి.