Heroine Dimple : కొద్దిరోజుల క్రితం తన కారుపై హీరోయిన్ డింపుల్ హయాతి, ఆమె బాయ్ ఫ్రెండ్ దాడి చేశారంటూ హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ కేసు పెట్టారు. దీనికి ఆధారంగా సీసీ టీవీ ఫుటేజ్ విడుదల చేశారు. ఆ వీడియోలో డింపుల్ హయాతీ కారును కాలితో తంతున్నట్లు విజువల్స్ రికార్డు అయ్యాయి. దాని ఆధారంగా ఆమె మీద సీఆర్పీసీ 41 ఏ సెక్షన్ క్రింద కేసు నమోదు చేశారు. ఈ కేసు కొట్టేయాలని డింపుల్ హయాతీ హైకోర్టును ఆశ్రయించారు. తనపై ఉద్దేశపూర్వకంగా, అధికార దుర్వినియోగంతో ఇరికించారని ఆమె ఆరోపిస్తున్నారు.
ఈ కేసుపై ఇరు వాదనలు విన్న హైకోర్టు సీఆర్పీసీ 41ఏ నిబంధనల మేరకే వ్యవహరించాలని ఆదేశించింది. జూబ్లీహిల్స్ లో డింపుల్ హయాతీ తన మిత్రుడుతో పాటు ఓ అపార్ట్మెంట్ లో నివాసం ఉంటున్నారు. కారు పార్కింగ్ విషయంలో డీసీపీ రాహుల్ హెగ్డేతో కొన్నాళ్లుగా వివాదం నడుస్తుందని సమాచారం. ఒక రోజు ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది డింపుల్ హయాతీ తన కారును తన్నడంతో పాటు డ్రైవర్ ని దుర్భాషలాడారని కేసు నమోదు చేశారు.
అయితే ఇదంతా రాహుల్ హెగ్డే అధికారం ఉపయోగించి అన్యాయంగా తనను ఇరికించడానికి చేస్తున్నాడని డింపుల్ హయాతీ ఆరోపిస్తున్నారు. నిజాలు ఎప్పటికైనా బయటపడతాయంటూ డింపుల్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో డింపుల్ తో పాటు ఆమె మిత్రుడిపై కేసు నమోదైంది.
డింపుల్ కెరీర్ ఏమంత ఆశాజనకంగా లేదు. ఆమెను వరుస పరాజయాలు వెంటాడుతున్నాయి. రవితేజకు జంటగా నటించిన ఖిలాడి బ్రేక్ ఇస్తుందని డింపుల్ హయాతీ భావించింది. ఆ మూవీ డిజాస్టర్ కావడంతో ఆమె ఆశలు గల్లంతయ్యాయి. రామబాణం మూవీలో లీడ్ హీరోయిన్ ఛాన్స్ కొట్టేసింది. గోపీచంద్-శ్రీవాస్ కాంబోలో విడుదలైన రామబాణం డబుల్ డిజాస్టర్ అయ్యింది. ప్రస్తుతం డింపుల్ చేతిలో సినిమాలేవీ లేవు.