Ravi Teja: మాస్ మహారాజా అంటూ రవితేజకి ఒక బిరుదు ఉంది. ఈ బిరుదులో మాస్ ఉంది గాని, రవితేజ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ఎంతవరకు మాస్ ఉందనేది ఆయనకే తెలియాలి. అయినా మాస్ మహారాజా అని పేరు పెట్టుకుని యాక్షన్ సీన్స్ అంటే భయపడడం ఎందుకు ? అవును, రవితేజ పై ఓ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేశారు. ఈ రోజు షూట్ కూడా జరుగుతుంది. కానీ ఎందుకో రవితేజ యాక్షన్ డోసు ఎక్కువగా ఉంది, ఆ రేంజ్ ఫైట్స్ మనకు సెట్ అవ్వవు అని లెక్కలు మాట్లాడుతున్నాడట.
పేరు ఏమో… మాస్ మహారాజా.. ఇమేజ్ ఏమో వెటకారం రాజా అంటే ఎలా రవితేజ ? అయినా యాక్షన్ సినిమాలు కొత్తేమి కాదు కదా. కాకపోతే.. ప్లాన్ చేసిన ఈ యాక్షన్ మరీ వైలెంట్ గా ఉందట. క్లుప్తంగా చెప్పుకుంటే బాలయ్య పై కంపోజ్ చేయాల్సిన ఫైట్ ను రవితేజ మీద ప్లాన్ చేసినట్టు ఉన్నారు. అయినా రవితేజ యాక్షన్ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతాడు. క్రాక్ సినిమాలో ఫుల్ యాక్షన్ చేశాడు కూడా. అలాగే హిట్ కూడా కొట్టాడు.
అయితే, క్రాక్ లో రవితేజ క్యారెక్టర్ పక్కా పోలీస్ ఆఫీసర్ పాత్ర. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమాలో లెక్చరర్ పాత్ర. అందుకే భారీ ఫైట్స్ వద్దు అంటున్నాడట. ఇంతకీ ఏ సినిమా అంటే ఇది.. ‘నేను లోకల్’ ఫేమ్ నక్కిన త్రినాధరావు దర్శకత్వంలో రవితేజ ఓ సినిమా చేస్తున్నాడు కదా. ఆ సినిమానే ఇది. రచయిత ప్రసన్న కుమార్ బెజవాడ రాసిన ఈ కథలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి.
ముఖ్యంగా కామెడీ బాగా కుదిరింది. కామెడీ కోసమే రవితేజ ఈ సినిమా చేస్తున్నాడు. అందుకే, సాధ్యమైనంత వరకూ ఈ సినిమాను ఫుల్ ఎంటర్ టైన్ గానే నడపాలని రవితేజ ప్లాన్ చేశాడు. ఇక రవితేజ 69వ చిత్రంగా ఈ సినిమా రాబోతుంది. సినిమాలో రవితేజ క్యారెక్టరైజేషన్ కూడా ఫుల్ కామెడీ టైమింగ్ తో సాగనుంది. రవితేజ కామెడీ ఎలాగూ బాగుంటుంది అనుకోండి. పైగా త్రినాథరావ్ నక్కిన కూడా మంచి కామెడీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు.
కాబట్టి.. తన గత చిత్రాలు ‘సినిమా చూపిస్తా మామ’ ‘నేను లోకల్’ సినిమాల శైలిలోనే నక్కిన ఈ సినిమాని కూడా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ గా మలచబోతున్నాడు. కాగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ల పై టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించనున్నారు. వివేక్ కూబిబొట్ట సహా నిర్మాతగా వ్యవహరించనున్నారు. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే నమ్మకం తో ఉన్నారు మేకర్స్.