Rashmi Gautam- Sudigali Sudheer: రష్మీ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతుంది. జబర్దస్త్ యాంకర్ గా వచ్చిన ఫేమ్ ఆమెను హీరోయిన్ ని చేసింది. చారుశీల, గుంటూర్ టాకీస్, రాణి గారి బంగ్లా, అంతకు మించి, నెక్స్ట్ నువ్వే.. ఇలా వరుసగా అరడజనుకు పైగా చిత్రాలు చేశారు. గుంటూర్ టాకీస్ కొంతలో కొంత పర్లేదు అనిపించుకుంది. మిగతా చిత్రాలన్నీ అలా వచ్చి ఇలా వెళ్లిపోయాయి. వరుస పరాజయాలతో ఆమెకు ఆఫర్స్ తగ్గాయి. హీరోయిన్ గా రష్మీ చివరి చిత్రం శివరంజని. యాంకర్ ప్రదీప్ హీరోగా తెరకెక్కిన ’30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ చిత్రంలో స్పెషల్ సాంగ్ చేశారు.

హీరోయిన్ గా ఇక కథ ముగిసినట్లే అనుకుంటున్న తరుణంలో రష్మీకి హిట్ పడింది. నవంబర్ 4న విడుదలైన బొమ్మ బ్లాక్ బస్టర్ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. రెండేళ్లుగా విడుదలకు నోచుకోకుండా మూలన పడ్డ చిత్రాన్ని బయటకు తీసి విడుదల చేస్తే అందరూ హిట్ అంటున్నారు. హీరో నందు పట్టుబట్టి సినిమా విడుదలయ్యేలా చేశాడు. పాపం పనిగట్టుకొని ప్రమోషన్స్ చేశారు. వాళ్ళ శ్రమకు ఫలితం దక్కింది.
రష్మీ హిట్ కొట్టిన నేపథ్యంలో ఇక సుడిగాలి సుధీర్ వంతు అంటున్నారు. ‘గాలోడు’ ట్రైలర్ చూశాక సుధీర్ కి హిట్ ఆన్ ది వే అంటున్నారు. నిన్న విడుదలైన గాలోడు ట్రైలర్ దుమ్మురేపుతోంది. దర్శకుడు యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్, లవ్ వంటి కమర్షియల్ అంశాలు కలగలిపి పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ తెరకెక్కించినట్లు తెలుస్తుంది. ట్రైలర్ లో ముఖ్యంగా సుధీర్ మేనరిజం, స్టైలిష్ డాన్స్ ఆకట్టుకుంటుంది. దర్శకుడు రాజశేఖర్ రెడ్డి పులిచెర్ల సుధీర్ ని సరికొత్తగా ఆవిష్కరించాడు అనిపిస్తుంది.

గాలోడు మూవీ టీజర్ 5.2 మిలియన్ వ్యూస్ రాబట్టగా నిన్న విడుదలైన ట్రైలర్ 2 మిలియన్ వ్యూస్ కి దగ్గరైంది. గాలోడు మూవీపై పాజిటివ్ బజ్ ఏర్పడిన నేపథ్యంలో హిట్ ఖాయమన్న మాట వినిపిస్తోంది. సుధీర్ ఫ్రెండ్, రూమార్డ్ గర్ల్ ఫ్రెండ్ రష్మీ గౌతమ్ బొమ్మ బ్లాక్ బస్టర్ మూవీతో హిట్ కొట్టిన నేపథ్యంలో సుధీర్ కి కూడా హిట్ పడనుందని అంచనా వేస్తున్నారు. ఈ బుల్లితెర స్టార్స్ కి టైం స్టార్ట్ అయ్యింది, ఇక వెండితెరను దున్నేస్తారు అంటున్నారు. గాలోడు చిత్ర హీరోయిన్ గా గెహనా సిప్పి నటించారు. సప్తగిరి, పృథ్వి, షకలక శంకర్ కీలక రోల్స్ చేశారు. సుధీర్ కి హీరోగా ఇది మూడో చిత్రం. గతంలో ఆయన నటించిన సుడిగాలి సుధీర్, 3 మంకీస్ విడుదలయ్యాయి.