Ram Gopal Varma Interrogation: భారత చిత్ర పరిశ్రమలో ఎంతో గుర్తింపు పొందారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ( director Ram Gopal Varma ). తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ సినిమాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్లో సైతం తనదైన ముద్ర చాటుకున్నారు. అటువంటి ఆర్జీవి అనేక వివాదాస్పద అంశాల్లో చిక్కుకున్నారు. ముఖ్యంగా ఏపీ రాజకీయాలను టచ్ చేసి కేసులకు గురయ్యారు. విచారణకు హాజరవుతూ వచ్చారు. తాజాగా ఓ కేసులో ఆయనను ప్రకాశం జిల్లా పోలీసులు 12 గంటలపాటు విచారణ చేపట్టారు.కీలక అంశాలను రాబెట్టే ప్రయత్నం చేశారు. వైసిపి హయాంలో ఆ పార్టీకి అనుకూలంగా పనిచేశారన్న విమర్శ రామ్ గోపాల్ వర్మపై ఉంది. ముఖ్యంగా అప్పటి కూటమి నేతలపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. అనుచిత పోస్టులు పెట్టేవారు. దానికి సంబంధించి ఇప్పుడు కేసులు ఎదుర్కొంటున్నారు.
వ్యూహం సినిమా ప్రమోషన్ లో..
వైసిపి( YSR Congress ) హయాంలో ఆ పార్టీకి అనుకూలంగా, రాజకీయ ప్రత్యర్థులకు వ్యతిరేకంగా రామ్ గోపాల్ వర్మ సినిమాలు తీసేవారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి పై తీసిన వ్యూహం చిత్రం ప్రమోషన్ నేపథ్యంలో.. కూటమి నేతలైన చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ పై బురదజల్లే క్రమంలో వారి ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు రాంగోపాల్ వర్మ. దీనిపై గతంలో టిడిపి కార్యకర్త చేసిన ఫిర్యాదు మేరకు ఒంగోలు పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణకు హాజరుకావాలని నోటీసులు అందజేశారు. అయితే కొద్ది రోజులపాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు రామ్ గోపాల్ వర్మ. అరెస్టు తప్పకుండా ఉంటుందని భావించి హైకోర్టు నుంచి వర్మ ఊరట పొందారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు అరెస్టు చేయకుండా విచారణ కోసం రావాలని ఒంగోలు రూరల్ పోలీసులు మరోసారి నోటీసులు పంపారు. దీంతో విచారణకు హాజరయ్యారు రాంగోపాల్ వర్మ.
Also Read: చంద్రబాబు, పవన్ తో ఎన్టీఆర్.. ఈసారికి సంధి కుదిరిందిలా..
12 గంటల పాటు విచారణ..
ఒంగోలులో( Ongole) దాదాపు 12 గంటల రాంగోపాల్ వర్మను విచారించారు పోలీసులు. చంద్రబాబు, లోకేష్, పవన్ ఫోటోల మార్ఫింగ్ వెనుక ఎవరున్నారు? ఇందులో ఇతరుల పాత్ర ఎంత అనే ప్రశ్నలను పోలీసులు సంధించినట్లు తెలుస్తోంది. రాంగోపాల్ వర్మ ఇచ్చే సమాధానాల ఆధారంగా ఈ కేసులో విచారణపై పోలీసులు ఓ నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. వాస్తవానికి ఫిబ్రవరిలోనే రాంగోపాల్ వర్మను విచారణకు పిలిచి అరెస్టు చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే కోర్టు ఆదేశాలతో పోలీసులు వెనక్కి తగ్గారు. రామ్ గోపాల్ వర్మ విషయంలో సైతం ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు ప్రచారం నడిచింది. ఈ తరుణంలోనే రెండోసారి విచారణకు పిలవడం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం హైకోర్టు ఆదేశాలు ఉండడంతో రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఉండదని తెలుస్తోంది. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ సైతం రాజకీయ విమర్శలకు దూరంగా ఉన్నారు.