Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘గేమ్ చేంజర్’ ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై బోల్తా కొట్టిన సంగతి తెలిసిందే. నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని తన 50 వ చిత్రంగా ప్రకటించి, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించాడు. ఈ సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆయన మాట్లాడుతూ, కేవలం పాటల కోసమే 75 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు చెప్పుకొచ్చాడు. శంకర్ ఏది కోరితే అది కాదు అనకుండా డబ్బులను మంచి నీళ్లు లాగా ఖర్చు చేశాడు. కచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది అనుకున్న ఈ సినిమా మొదటి ఆట నుండే డిజాస్టర్ ఫ్లాప్ టాక్ ని కైవసం చేసుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే రామ్ చరణ్ కి ఉన్నటువంటి పాన్ ఇండియన్ స్టార్ స్టేటస్ కారణంగా ఈ సినిమాకి ఓపెనింగ్స్ వరకు బాగానే వచ్చాయి.
కానీ సోషల్ మీడియా లో మాత్రం ట్రోల్స్ దారుణంగా పడ్డాయి. విడుదలకు ముందే ఈ సినిమాకి సంబంధించిన పూర్తి స్టోరీ ని ఆన్లైన్ లో లీక్ చేసారు. ఇక విడుదల తర్వాత ఏకంగా HD ప్రింట్ ని ఆన్లైన్ లో పెట్టేశారు. దీని వెనుక పెద్ద గ్యాంగ్ ఉందని, విడుదలకు ముందు నుండే వాళ్ళు మా మూవీ టీం కి బెదిరింపు కాల్ చేసారని అందుకు సంబంధించిన వివరాలు ఆధారాలతో సహా మూవీ టీం పోలీసులకు కంప్లైంట్ చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను రీసెంట్ గానే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అయితే జరిగిన ఈ నెగటివిటీ పై మెగా ఫ్యాన్స్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయారు. ఒక హీరో పై ఇంత నెగటివిటీ చూడడం ఇదే మొదటిసారి అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా రామ్ చరణ్ బాలయ్య ‘అన్ స్టాపబుల్’ షోలోని ఒక ఎపిసోడ్ కి ముఖ్య అతిథిగా పాల్గొన్న సంగతి తెలిసిందే.
ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ ‘పరాజయం ఎదురైనప్పుడు ఈ సంవత్సరం మనది కాదు అనుకోని ముందుకు వెళ్ళిపోవాలి. ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకూడదు. మనకి కూడా కచ్చితంగా టైం వస్తుంది. అప్పటి వరకు ఎదురు చూడడం తప్ప చేసేదేమి లేదు’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. దీనిని కొంతమంది మెగా అభిమానులు సోషల్ మీడియా లో షేర్ చేస్తూ, ‘గేమ్ చేంజర్’ కారణంగా డిప్రెషన్ లోకి వెళ్లిన తోటి అభిమానులకు ధైర్యం చెప్పేలా ఈ వీడియో ని షేర్ చేసారు. అది బాగా వైరల్ అయ్యింది. పరాజయాలు వచ్చినప్పుడు నువ్వు ఎలా తీసుకుంటావు అని బాలయ్య బాబు అడిగిన ప్రశ్న కి రామ్ చరణ్ చెప్పిన సమాధానం ఇది. ప్రస్తుతం ఆయన బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రంగస్థలం కి మించిన సినిమా అవుతుందని రామ్ చరణ్ బలమైన నమ్మకంతో చెప్పుకొచ్చాడు. మరి ఈ చిత్రం విడుదలయ్యే వరకు ఎదురు చూడాల్సిందే.