Ram Charan Acharya’s failure కొరటాల శివ ఇమేజ్ డ్యామేజ్ చేసిన చిత్రంగా ఆచార్య నిలిచిపోయింది. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కొరటాల అంత పెద్ద డిజాస్టర్ ఇస్తారని ఊహించలేదు. మెగా ఫ్యామిలీకి ఆచార్య ప్రత్యేకంగా నిలవాల్సింది. ఎందుకంటే చిరంజీవి-రామ్ చరణ్ నటించిన పూర్తి స్థాయి మల్టీస్టారర్. చిరంజీవి సతీమణి సురేఖ ఇష్టపడి మరి సిద్ద క్యారెక్టర్ చరణ్ తో చేయించుకున్నారనే టాక్ ఉంది. అనూహ్యంగా ఆచార్య చేదు అనుభవం మిగిల్చింది. స్క్రిప్ట్ విషయంలో కొరటాల చేసిన తప్పులు సినిమాకు శాపం అయ్యాయి. చిత్రీకరణ జరిగాక స్క్రిప్ట్ మార్చారు.
చిరంజీవికి జంటగా నటించిన కాజల్ పాత్ర తీసిపడేశారు. రీషూట్స్ పేరుతో అనేక రిపేర్స్ చేశారు. చివరకు దారుణ ఫలితం చవిచూడాల్సి వచ్చింది. ఫెయిల్యూర్ ఒక ప్రక్క బయర్లతో పంచాయితీలు మరో ప్రక్క చిరంజీవిని తీవ్ర అసహనానికి గురి చేశాయి. ఆచార్య నిర్మాతగా ఉన్న రామ్ చరణ్ చాలా ఖర్చుపెట్టారు. మూవీ ఆలస్యం కావడంతో బడ్జెట్ భారీగా పెరిగిపోయింది. అన్ని విధాలా ఆచార్య దెబ్బతీసింది.

ఆచార్య ఫెయిల్యూర్ కి పూర్తి బాధ్యత కొరటాల శివదే అన్న అసహనం చిరంజీవిలో ఉంది. అది రెండు మూడు సందర్భాల్లో ఆయన బయటపెట్టారు కూడాను. సినిమాను విజయ తీరానికి చేర్చాల్సింది దర్శకుడే. అందుకే కంటెంట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. దర్శకుడు ఫెయిల్ అయితే అందరూ నష్టపోతారని ఆయన వెల్లడించారు. రామ్ చరణ్ మాత్రం ఇన్ని నెలల్లో ఒక్కసారి కూడా పెదవి విప్పలేదు. ఆచార్య గురించి ఆయన మాట్లాడలేదు.
ఫస్ట్ టైం రామ్ చరణ్ స్పందించారు. ఆర్ ఆర్ ఆర్ తర్వాత నా నుండి ఒక స్మాల్ రిలీజ్ అయ్యింది. అందులో నేను గెస్ట్ రోల్ చేశాను. ఆ సినిమాను చూడటానికి ప్రేక్షకులు ముందుకు రాలేదు. కాబట్టి ఏ హీరో నటించినా సినిమాలో కంటెంట్ ఉండాలి. కంటెంట్ లేకపోతే ప్రేక్షకులు సినిమాను ఇష్టపడరు, అని రామ్ చరణ్ అన్నారు. రామ్ చరణ్ ఆచార్య టైటిల్ ప్రస్తావించకున్నప్పటికీ ఇక్కడ చెప్పింది, ఆ చిత్రం గురించే అని స్పష్టంగా అర్థం అవుతుంది. చిరంజీవితో పాటు రామ్ చరణ్ కూడా ఆచార్య ఫెయిల్యూర్ పట్ల అసహనంగా ఉన్నారని ఈ వ్యాఖ్యలతో అవగతం అవుతుంది. ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో తన 15వ చిత్రం చేస్తున్నారు.