Ram Charan: భారీ ఆశలు పెట్టుకున్న ‘గేమ్ చేంజర్’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టిన సంగతి అందరికీ తెలిసిందే. డైరెక్టర్ శంకర్, నిర్మాత దిల్ రాజుకి పోయిందేమి లేదు కానీ, రామ్ చరణ్ కి మాత్రం మూడేళ్ళ విలువైన సమయం వృధా అయ్యింది. ఈ చిత్రం కోసం ఆయన రెండు మంచి సబ్జక్ట్స్ ని కూడా వదులుకున్నాడు. పూర్తి స్థాయి డెడికేషన్ తో ఎప్పుడు అడిగినా డేట్స్ ఇస్తూ దర్శక నిర్మాతలకు సహకరించాడు. కానీ వాళ్లిద్దరూ చేతులెత్తేశారు. డైరెక్టర్ శంకర్ ని చాలా గుడ్డిగా నమ్మిన రామ్ చరణ్ కి భంగపాటు తప్పలేదు. సినిమాలో అభిమానులు గుర్తించుకోదగ్గ ఒక్క మంచి సన్నివేశాన్ని కూడా తీయలేకపోయాడు శంకర్. రామ్ చరణ్ ఎంతో అద్భుతంగా నటించిన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని మాత్రం చాలా తొందరగా ముగించేశాడు. ఈ ఫ్లాష్ బ్యాక్ సన్నివేశాన్ని మరో 20 నిమిషాలు పొడిగించి ఉండుంటే సినిమా ఫలితం మరోలా ఉండేది.
ఇక నిర్మాత దిల్ రాజు ఈ సినిమా విడుదలైన నాలుగు రోజులకు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రాన్ని విడుదల చేసి, ‘గేమ్ చేంజర్’ ద్వారా వచ్చిన నష్టాలను పూడ్చుకోగలిగాడు. అయితే విడుదల తర్వాత ఆయన ఈ సినిమాని గాలికి వదిలేసాడు. కనీసం పండగ సమయంలో కూడా ప్రొమోషన్స్ చేయలని అనుకోలేదు. జనాల్లోకి ఈ చిత్రాన్ని బలంగా తీసుకెళ్లడంలో విఫలమయ్యాడు. ఇవన్నీ రామ్ చరణ్ దృష్టిలో బలంగా రిజిస్టర్ అయ్యాయి. ఎట్టి పరిస్థితిలోను తన తదుపరి చిత్రంతో బౌన్స్ బ్యాక్ అయ్యి, తనని విమర్శించిన వాళ్లందరికీ బలంగా సమాధానం చెప్పాలని అనుకున్నాడు. అందుకే బుచ్చి బాబు తో చేస్తున్న సినిమాపై ఆయన పెడుతున్న ఫోకస్ ఇంతకు ముందు ఏ సినిమా మీద కూడా పెట్టడం లేదని తెలుస్తుంది. తీస్తున్న ప్రతీ సన్నివేశాన్ని ఆయన చాలా సూక్షమంగా పరిశీలిస్తున్నాడట. ఔట్పుట్ ని ఒకటికి రెండు సార్లు చెక్ చేస్తున్నాడట.
సన్నివేశం బాగా రాకపోతే ఎన్నిసార్లు రీ షూట్ చేయడానికైనా ఆయన వెనకాడడం లేదట. అంతే కాదు ఈ సినిమా షూటింగ్ సెట్స్ లోకి మొబైల్ ఫోన్స్ ఎవ్వరూ తీసుకొని రాకూడదని, ఒక్క ఫోటో కూడా మన షూటింగ్ లొకేషన్ నుండి బయటకి వెళ్లేందుకు వీలు లేదని బుచ్చి బాబు టీం కి చాలా కఠినమైన ఆంక్షలు విధించాడట. సినిమాకి సంబంధించిన డేటా పట్ల ఆయన చాలా కచ్చితంగా ఉంటున్నాడని తెలుస్తుంది. ఎందుకంటే ‘గేమ్ చేంజర్’ చిత్రానికి సంబంధించినవి విడుదలకు ముందు చాలా లీక్ అయ్యాయి. ముందుగా ‘జరగండి’ పాటను లీక్ చేసారు. విడుదలకు దగ్గరగా ఉన్న సమయంలో స్టోరీ మొత్తాన్ని లీక్ చేసారు. ఇక విడుదల తర్వాత మొదటి రోజే HD ప్రింట్ ని ఆన్లైన్ లో అప్లోడ్ చేసారు. ఇలాంటివి మళ్ళీ పునరావృత్తం కాకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలుస్తుంది. చూస్తుంటే రామ్ చరణ్ ఈ సినిమాని చాలా పర్సనల్ గా తీసుకున్నట్టు అందరికీ అర్థం అవుతుంది. శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ లో విడుదల చేయలని చూస్తున్నారు.