Ram Charan: శంకర్..ఒకప్పుడు ఈ పేరుకి సౌత్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనతో సినిమాలు చేసేందుకు పెద్ద పెద్ద సూపర్ స్టార్స్ కూడా ఆతృతగా ఎదురు చూసేవారు, అదృష్టంగా భావించేవారు. కొంతమంది హీరోలైతే కనీసం కాసేపైనా ఆయన సినిమాలో కనిపిస్తే చాలు అని కోరుకునేవారు. అలాంటి స్థాయి ఉన్న శంకర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఆయన పేరు తీస్తే భయపడి పారిపోయే పరిస్థితి ఏర్పడింది. రోబో తర్వాత శంకర్ సినిమాల్లో కంటెంట్ తగ్గుతూ వచ్చింది. ‘2 పాయింట్ O’ చిత్రంతో శంకర్ పని ఇక అయిపోయింది అని అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ‘ఇండియన్ 2 ‘ తో ఇక శంకర్ శాశ్వతంగా షెడ్డుకి వెళ్ళినట్టే అని నిర్ధారణ చేసుకున్నారు ప్రేక్షకులు. పాపం ఈ విషయం రామ్ చరణ్ కి ముందే తెలిసి ఉంటే బాగుండేది. ‘ఇండియన్ 2’ తో పాటు సమాంతరంగా ‘గేమ్ చేంజర్’ షూటింగ్ కూడా జరగడంతో బుక్ అయిపోయాడు.
ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్స్ గా నిలిచాయి. శంకర్ కి ఉన్న వ్యక్తిగత కారణాల వల్ల గేమ్ చేంజర్ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యింది. పాత కమిట్మెంట్స్ కారణంగా లైకో నిర్మాణ సంస్థ కచ్చితంగా ‘ఇండియన్ 2 ‘ షూటింగ్ పూర్తి చేయాల్సిందే అంటూ కోర్టు మెట్లు ఎక్కడంతో, ‘గేమ్ చేంజర్’ షూటింగ్ మధ్యలో ‘ఇండియన్ 2’ షూటింగ్ కూడా చేయాల్సి వచ్చింది. ఈ కారణం చేత రామ్ చరణ్ కి బోలెడంత ప్రైమ్ టైం వృధా అయ్యింది. శంకర్ కారణంగా నష్టం వచ్చినప్పటికీ, మనసులో ఎలాంటి భేదభావాలు, అసంతృప్తి పెట్టుకోకుండా, మూడేళ్లు మరో సినిమాకి షిఫ్ట్ అవ్వకుండా ‘గేమ్ చేంజర్’ కోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలోనే రామ్ చరణ్ శంకర్ తో మరో ప్రాజెక్ట్ కూడా ఓకే చేసుకున్నట్టు అప్పట్లో వార్తలు వినిపించాయి.
డైరెక్టర్ శంకర్ ‘అండర్ వాటర్’ జానర్ లో ఒక భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని, ఇందులో కూడా రామ్ చరణ్ హీరోగా నటిస్తాడని, ఈ చిత్రానికి దాదాపుగా 500 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ఖర్చు అవుతుందని అప్పట్లో ఒక వార్త తెగ పచార్లు చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ ఇప్పటికీ అలాగే ఉందా, లేదా అనేది చూడాలి. శంకర్ మీద అపారమైన గౌరవం రామ్ చరణ్ కి ఉంది కాబట్టి, ఆయన మరో సినిమా చేసే అవకాశం అడిగితే రామ్ చరణ్ ముఖం మీదనే ‘నో’ చెప్పడం కుదరదు. ఎందుకంటే రామ్ చరణ్ కి ఎంత మొహమాటం అనేది అందరికీ తెలిసిందే. అయితే ఒకప్పుడు శంకర్ కి 500 కోట్లు బడ్జెట్ పెట్టే నిర్మాతలు దొరికేవారు కానీ, ఈసారి మాత్రం అంత బడ్జెట్ పెట్టే వాళ్ళు దొరకరు. కాబట్టి అభిమానులు కంగారు పడాల్సిన అవసరం లేదని, ఈ ప్రాజెక్ట్ కార్య రూపం దాల్చే అవకాశం లేదని సోషల్ మీడియా లో విశ్లేషకులు చెప్తున్నారు.