Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడనే చెప్పాలి. ఒక వైపు రాజమౌళితో చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్ మూవీ త్వరలోనే విడుదలకు సిద్దమైంది. మరోవైపు శంకర్ దర్శకత్వంలో చేయనున్న సినిమాను కూడా త్వరగా కంప్లీట్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ఓ ఆసక్తికర వార్త తెలుస్తుంది.

ఈ నెల 22న పూణేలో ఈ కిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. ప్రస్తుతం చెర్రీ, కియారా అద్వానీ లపై ఓ సాంగ్ తో పాటు పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. నవంబర్ 2తో మొదటి షెడ్యూల్ పూర్తి కాబోతోందని సమాచారం. రెండో షెడ్యూల్ ను హైదరాబాద్ లో చేయనున్నారట. కాగా పాన్ ఇండియా స్థాయిలో బహుభాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోందని చిత్రా బృందం ప్రకటించింది. ఇందులో విలన్ గా మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీ నటించబోతున్నట్టు వార్తలొస్తున్నాయి.
అలానే ఈ చిత్రంలో శ్రీకాంత్, జయరామ్, నవీన్ చంద్ర, అంజలి, సునీల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలో చెర్రీ ఐఏయస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఓ ఐఏయస్ ఆఫీసర్ రాజకీయాల్లో చేరి ఆ వ్యవస్థను ఏ విధంగా ప్రక్షాళన గావిస్తాడు అనే కధాంశంతో మూవీ రూపొందిస్తున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. గతంలో అర్జున్ తో శంకర్ తీసిన ‘ఒకే ఒక్కడు’ తరహాలో ఇంటెన్స్ డ్రామాతో ఆసక్తికరమైన సన్నివేశాలతో గ్రాండియర్ విజువల్స్ తో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం.