South Indian Film Industry: ఏ ముహూర్తంలో రాజమౌళి తన బాహుబలి సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో విడుదల చేశాడో గానీ.. అప్పటినుంచి దక్షిణాది సినిమా రూపం ఒక్కసారిగా మారిపోయింది. ప్రభ వెలిగిపోవడం ప్రారంభమైంది. రాజమౌళి బాహుబలి 2 కోసం యావత్ దేశం మొత్తం ఆత్రుతగా ఎదురు చూసింది అంటే ఇందుకు కారణం అదే. ఇదే ఊపులో కేజీఎఫ్, కేజీఎఫ్2 పుష్ప, ఆర్ ఆర్ ఆర్, పొన్నియన్ సెల్వన్, కాంతారా, విక్రమ్, కార్తికేయ _2 ఇలా దక్షిణాది చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద కనకవర్షం కురిపించాయి.. ఈ సినిమాలు బ్లాక్ బస్టర్ గా నిలిస్తే బాలీవుడ్ సినిమాలు అడ్డంగా తన్నేశాయి.
సీఐఐ నివేదిక ప్రకారం..
“సౌత్ ఇండియా సెట్టింగ్ బెంచ్ మార్క్స్ ఫర్ ద నేషన్ ఇన్ మీడియా అచీవ్ ఎంటర్టైన్మెంట్” అనే పేరుతో “కాన్ఫిడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ” తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. అందులో దక్షిణాది చిత్ర పరిశ్రమ వృద్ధిని అంకెల రూపంలో వెల్లడించింది. దాని ప్రకారం.. భారతదేశ చిత్ర పరిశ్రమ మొత్తం వార్షిక ఆదాయం 15 వేల కోట్లు అనుకుంటే.. 52 శాతం దక్షిణాది చిత్రాల ద్వారానే వస్తోంది. అంతేకాదు 2022లో దక్షిణ చిత్ర పరిశ్రమ ఏకంగా 96% వృద్ధి నమోదు చేసింది. ఇక ఆదాయపరంగా చూస్తే తమిళ్ ( కోలీవుడ్) ₹2,950 కోట్లతో అగ్రస్థానంలో నిలిచింది.. టాలీవుడ్ 2,500 కోట్లతో రెండవ స్థానంలో, ₹1,570 కోట్ల ఆదాయంతో శాండల్ వుడ్ ( కన్నడ), ₹816 కోట్ల ఆదాయంతో మలయాళ చిత్ర పరిశ్రమ నాలుగో స్థానంలో నిలిచాయి. గత ఏడాది దేశంలో మొత్తం 1691 చిత్రాలు విడుదలయ్యాయి. వాటిలో 916 సినిమాలు అంటే సగం కంటే ఎక్కువ దక్షిణాది భాషా చిత్రాలే.
ఈ ఏడాది సాధ్యమవుతుందా?
అయితే ప్రతి ఏడాది ఆర్ ఆర్ ఆర్, కే జి ఎఫ్_2, కాంతార వంటి సూపర్ హిట్లు రావడం సాధ్యపడదు. గత ఏడాదితో పోలిస్తే 2023లో వసూళ్ల పరంగా చూస్తే కొంత తేడా కనిపించే అవకాశం ఉంది. 2024 లో కూడా ఈ పరిస్థితి కొనసాగ వచ్చని తెలుస్తోంది. అయితే ఈ ఏడాది కూడా దక్షిణాది సినిమాల హవా కొనసాగుతుందని సిఐఐ అంచనా వేసింది. అయితే ఈ అంచనాల నేపథ్యంలో ఇక దక్షిణాది సినిమాకు తిరుగు ఉండదా? హిందీ సినిమా మీద అది ఆధిపత్యం కొనసాగిస్తుందా? అంటే దీనికి సమాధానం చెప్పడం చాలా కష్టం. గత కొన్ని సంవత్సరాలుగా హిందీలో వచ్చే సినిమాలు జనాలను అంతగా ఆకట్టుకోవడం లేదు. ఈ క్రమంలో ప్రేక్షకులకు ప్రత్యామ్నాయంగా దక్షిణాది సినిమాలు నిలిచాయి. అయితే ఈ అనుభవాల నేపథ్యంలో హిందీ సినిమా ప్రస్తుతం తన తప్పుల్ని పునః సమీక్షించుకునే పనిలో పడింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం బాలీవుడ్ అంత త్వరగా సౌత్ సినిమాకు పెత్తనం అప్పగించదు. ఇక ఇటీవల సల్మాన్ ఖాన్ సినిమా ఒకటి విడుదలైంది. అది బాక్స్ ఆఫీస్ వద్ద అడ్డంగా తన్నేసింది. షారుఖ్ ఖాన్ నటించిన పటాన్ మెరుగైన వసూళ్ళు సాధించింది. అక్షయ్ కుమార్ ఇంకా గాడిలో పడలేదు. అజయ్ దేవగణ్ మాత్రం రెట్టించిన ఉత్సాహంతో సినిమాలు తీస్తున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్లో “తూ ఝుటీ మై మక్కర్” 200 కోట్లు వసూలు చేసింది.. “మిసెస్ చటర్జీ వర్సెస్ నార్వే” సినిమా కూడా హిట్ అయింది. బాలీవుడ్ కూడా మెల్లిగా గాడిలో పడుతున్నది.
సౌత్ సినిమాలు చతికిల పడ్డాయి
చాలా వరకు సౌత్ సినిమాలు కూడా పాన్ అనే వాత పెట్టుకొని చతికిలపడ్డాయి. సో సౌత్ సినిమా బాలీవుడ్ పై ఆధిపత్యం కొనసాగిస్తుందనేది ఆశావాదం లాగానే భావించాలి. ఒకవేళ హిందీలో భిన్నమైన కథలతో, ట్రీట్మెంట్ తో సినిమాలు మొదలైతే.. సౌత్ నుంచి డబ్బింగ్ తో హిందీలోకి వచ్చే సినిమాలకు ఆదరణ తగ్గుతుంది. ఎందుకంటే నార్త్ ప్రేక్షకులు ఒక పట్టాన సౌత్ సినిమాలను అంగీకరించరు. పేరుకు సౌత్ లో థియేటర్ల సంఖ్య ఎక్కువ, కానీ నార్త్ ఇతర ప్రాంతాల్లో హిందీ స్టార్స్, హిందీ సినిమాలకే రీచ్ ఎక్కువ. పైగా మార్కెట్ కూడా వందల కోట్లల్లో ఉంటుంది. ఒకవేళ సినిమా హిట్ అయితే వసూళ్ల ప్రభంజనం సాగుతుంది.
కళ్ళు వాటి మీదే
పొన్నియన్ సెల్వన్_2 విడుదలైంది. పార్ట్ వన్ లాగే అది తమిళనాడు ప్రాంతంలో మాత్రమే వసూళ్లు కురిపిస్తోంది. నార్త్ వాళ్లకు అది ఎక్కడ కాబట్టి దాన్ని లైట్ తీసుకున్నారు. ఇప్పుడు అందరి కళ్ళు ఆది పురుష్ మీదే ఉన్నాయి.. ఇక తెలుగు సినిమా విషయానికొస్తే రాజమౌళి సినిమా ఇప్పట్లో లేదు. పుష్ప_2 భారీ వ్యాపారాన్ని నమోదు చేసుకున్నప్పటికీ ఎలా ఉంటుందో తెలియదు. బలగం సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకున్నప్పటికీ దాని వ్యాపార విలువ 20 కోట్ల లోపే ముగిసింది.. ఇటీవల ఎంతో హైప్ తో విడుదలైన శాకుంతలం, రంగమార్తాండ గాలికి కొట్టుకుపోయాయి. అయితే మన సినిమా మీద సీఐఐ ఆర్గనైజేషన్లు అంచనాలకు దిగడం మాత్రం ఇక్కడ గొప్పగా చెప్పుకోవాలి.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Rajamoulis baahubali movie changed the face of the south indian film industry
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com