తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం రాజమౌళి దర్శక దిగ్గజంగా వెలుగొందుతున్నాడు. పరాజయమెరుగని ధీరుడుగా ముందుకు సాగుతున్నాడు. తెలుగు సినిమా ఖ్యాతినికి ప్రపంచానికి పరిచయం చేశాడు. ఇందులో ఎవరికీ అనుమానం లేదు. అన్నీ అభినందనలే. అయితే.. ఈ పేరుతో ఏదైనా చేస్తామంటే కుదురుతుందా? ఇండస్ట్రీ రాసుకున్న నిబంధనలను.. తాను తుడిపేస్తూ పోతానంటే చూస్తూ ఊరుకోవలసిందేనా? ఇదే.. ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇంతకీ.. ఏం జరిగిందంటే?
రాజమౌళిపై ఒక అపవాదు ఉంది. సినిమా ఎప్పుడు ముగిస్తాడో.. ఎప్పుడు రిలీజ్ చేస్తాడో ఆయనకే క్లారిటీ ఉండదు అన్నది ఆ విమర్శ. అది నిజమేనని ఆయన సినిమాల గురించి తెలిసిన అందరూ చెబుతారు. అయితే.. అది దర్శకుడిగా ఆయన ఇష్టం. భరించే నిర్మాతలు, హీరోల ఇష్టం. కానీ.. సినిమా విడుదల దగ్గరకు వచ్చే సరికి ఒక పద్ధతి అనేది ఉండాలని ఇండస్ట్రీలోని వారు తమకు తాముగా ఒక రూల్ పెట్టుకున్నారు. దీని ప్రకారం.. సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో ప్రొడ్యూసర్ గిల్డ్ లో నమోదు చేయాల్సి ఉంటుంది.
ఎందుకంటే.. సినిమా ఇండస్ట్రీకి పెద్ద సీజన్లు కొన్ని మాత్రమే ఉన్నాయి. ఇందులో సంక్రాంతి అనేది అతిపెద్ద సీజన్. ఆ తర్వాత దసరా, దివాళి, సమ్మర్ వంటి సీజన్లు ఉన్నాయి. ఇందులో దసరా సీజన్ కు రాబోతున్నట్టు రాజమౌళి ప్రకటించాడు. అక్టోబర్ 13న రాబోతున్నామని నిన్నా మొన్నటి వరకూ చెప్పారు. కానీ.. ఇప్పుడు సంక్రాంతి మీద కన్నేసినట్టు సమాచారం. దీనిపై ఇప్పుడు దుమారం రేగుతోంది.
ఆర్ ఆర్ ఆర్ దసరాకు వస్తోందని.. మిగిలిన పెద్ద సినిమాలన్నీ సంక్రాంతికి వెళ్లిపోయాయి. ఇప్పటికే రిలీజ్ డేట్లు కూడా ప్రకటించాయి. పవన్-రానా ‘భీమ్లా నాయక్’ జనవరి 12న, మహేష్ ‘సర్కారువారి పాట’ 13న, ప్రభాస్ ‘రాధేశ్యామ్’ 14న విడుదల చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ ను కూడా సంక్రాంతికి బరిలో దించబోతున్నట్టు సమాచారం. జనవరి 8న రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. దీంతో.. రాజమౌళి తీరుపై అసహనం వ్యక్తమవుతోంది.
ఇష్టారీతిన ఇలా రిలీజ్ డేట్లు మారుస్తూ పోతే ఎలా అని అంటున్నారు పలువురు నిర్మాతలు. పెద్ద సినిమా పేరుతో ఇలా వ్యవహరిస్తే సరిపోతుందా? అంటున్నారు. ఆర్ ఆర్ ఆర్ తో పోటీ అంటే.. ఖచ్చితంగా కలెక్షన్ల మీద ప్రభావం పడుతుంది. కాబట్టి.. వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే.. పెద్ద సినిమా ఎప్పుడు వస్తే అప్పుడు మిగిలినవి తప్పుకోవాల్సిందేనా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ తీరు ఏమాత్రం సరికాదని, నిబంధనలు ఉల్లంఘించి ఇలా చేస్తూ పోతే.. ఇక గిల్డ్ ఉండి ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. రేప్పొద్దున మరికొన్ని పెద్ద సినిమాలు కూడా ఇదే విధంగా వ్యవహరించే అవకాశం ఉండదా? అని అంటున్నారు. మరి, దీనికి రాజమౌళి ఏం సమాధానం చెబుతాడో?