RRR: దాదాపు మూడేళ్లుగా రాజమౌళితో సహవాసం చేస్తూ.. కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొంటూ ఎట్టకేలకు సినిమాను పూర్తి చేశారు టాలీవుడ్ అగ్రహీరోలు ఎన్టీఆర్, రాంచరణ్.. ఇటీవలే ఉక్రెయిన్ లో షూటింగ్ పూర్తికాగా.. తాజాగా డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. అంటే దాదాపుగా సినిమా పూర్తయినట్టే లెక్క.. ఇప్పుడు మిగతా భాషల డబ్బింగ్ కూడా పూర్తి చేసి జనవరి 7వ తేదీకి ఈ సినిమాను విడుదల చేయడానికి రెడీ చేస్తున్నారు. ఈ మేరకు తేదీని కూడా అనౌన్స్ చేశారు.
అంతర్జాతీయ స్థాయిలో పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తీస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవ్ గణ్, ఆలియా భట్ కూడా నటించడంతో సినిమాకు భారీ హైప్ వచ్చేసింది.
ఆర్ఆర్ఆర్ నిజానికి సంక్రాంతి బరిలో నిలవాల్సింది. కానీ సంక్రాంతికి ఒక వారం ముందుకు షిఫ్ట్ అయ్యింది. సంక్రాంతి బరిలో దిగడంతో మిగతా హీరోలు , నిర్మాతలు ఇప్పుడు రాజమౌళి నిర్ణయంపై మండిపడుతున్నారు. పైకి ఏమీ మాట్లాడకపోయినా.. లోలోపల మాత్రం రాజమౌళిపై అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు.
ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ టాకీ పార్ట్ మొత్తం పూర్తయ్యింది. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడలో తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను ఎన్టీఆర్ చెప్పుకోవడం విశేషం. ఇటు రాంచరణ్ తెలుగు, హిందీ, తమిళంలో మాత్రమే తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పినట్లు సమాచారం. ఇక అజయ్ దేవ్ గణ్, ఆలియాతోపాటు మిగతా నటీనటులు ఈ సినిమా డబ్బింగ్ పనులు పూర్తి చేసే పనిలో పడ్డారట.. డబ్బింగ్ పూర్తి కావడంతో ఈ సినిమా ఫైనల్ గా కట్ చేసే పనిలో రాజమౌళి పడినట్టు సమాచారం.
ఇక ఆర్ఆర్ఆర్ కు ముందే ‘ఆలియా భట్, అజయ్ దేవ్ గణ్’ నటించిన ‘గంగూభాయ్ కతియావాడి’ కూడా విడుదల అవుతోంది. దీంతో వారి రెండు చిత్రాలు ఒకరోజు తేడాతో విడుదల అవుతుండడం సంచలనంగా మారింది.