Rajamouli: రాముడు అర్థం కాడు. కృష్ణుడిని అర్థం చేసుకోవాలనుకోవడం అనవసరం. ఈ రెండు రూపాలను దర్శించుకోవడమే అతిపెద్ద భాగ్యం. స్థూలంగా చెప్పాలంటే రాముడిలో రమించాలి. కృష్ణుడిలో పరవశించాలి. అంతేతప్ప వీరిద్దరిని తిట్టకూడదు. అనవసరంగా నోరు జారకూడదు. పెద్ద దర్శకుడిగా.. వైఫల్యం అనేది తెలియకుండా దూసుకుపోతున్న తెలుగు చిత్ర దర్శకుడు రాజమౌళి కచ్చితంగా రాముడి గురించి కొంతలో కొంత అధ్యయనం చేయాలి. కృష్ణుడి గురించి కాస్తలో కాస్త తెలుసుకోవాలి. అలాకాకుండా నేను దేవుడిని నమ్మను.. అంటూనే వారణాసి జనం నవ్వుకుంటారు. సోషల్ మీడియాలో దుమ్మెత్తి పోస్తారు. కాస్త ఆ దుమ్మును చూసైనా రాజమౌళి మారాలి.
తాము మేధావులం అనుకునేవారు.. రాముడు, కృష్ణుడి మధ్య పోలికలు పెడుతుంటారు. వాస్తవానికి రాజమౌళి చెప్పినట్టుగా రాముడు అంత ఈజీగా అర్థమయ్యే సబ్జెక్టా? ఒకవేళ రాముడు అర్థం అయినప్పటికీ కృష్ణుడు అంత సులువుగా బోధపడతాడా? పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో, పెద్ద పెద్ద కొలువులు చేస్తేనో.. అంతకంటే గొప్పగా రాస్తేనో రాముడు అర్థం కాడు. కృష్ణుడు బోధపడడు. వాస్తవానికి వీరిద్దరూ అంతా అర్థమైతే.. అడ్డగోలుగా మాట్లాడరు. మరీ ముఖ్యంగా రాజమౌళి లాంటివారు అసలు మాట్లాడారు.
అవగాహన లేకపోవడం వల్లే రాజమౌళి ఇటీవల దేవుళ్ళ గురించి ముఖ్యంగా రాముడి గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడారు. రాజమౌళి మాత్రమే కాదు, మిగతావారు కూడా రాముడు కృష్ణుడి కంటే తక్కువని.. రావణుడు కృష్ణుడు, రాముడి కంటే గొప్ప అన్నట్టుగా మాట్లాడుతుంటారు. గౌతమ బుద్ధుడిని మించినవాడు లేడని చెబుతుంటారు. వాస్తవంగా ఇదంతా కూడా సూడో మేధావితనం. ఇక మన మీడియా గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. అడ్డగోలుగా ప్రచారం చేస్తూనే ఉంటుంది. వాస్తవానికి ఇటువంటి వ్యాఖ్యలు చేసేవారు మేధావులు కారు. మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించే వ్యక్తులు.
కృష్ణుడిని ప్రేమించే వారికి రాముడు నచ్చడు. అసలు రాముడు చేసిన త్యాగం ఎంత గొప్పది.. అతడు నెరవేర్చిన కర్తవ్యం ఎంత అద్భుతమైనది. తండ్రి కోసం రాజ్యాన్ని వదులుకున్నాడు. మునుల కోసం, రుషుల కోసం రాక్షసులను చంపినవాడు. భార్య కోసం లంకాధిపతిని సర్వనాశనం చేశాడు. భార్య తరలివస్తే ఆమెను కాదన్నాడు. రాజుగా నైతికతను నెత్తికి ఎత్తుకున్నాడు. భార్య కోసం కాదు ధర్మం కోసం యుద్ధం చేశానని నిరూపించాడు. జీవితంలో ఎటువంటి త్యాగం చేయని స్వార్ధపరులకు రాముడు ఎప్పటికీ అర్థం కాదు.
రాముడనేవాడు ఉవ్వెత్తున ఎగిసిపడే మహాసముద్రం లాంటివాడు. అలలను చూసి రాజమౌళి లాంటివారు అవే రామరూపం అనుకుంటారు. కానీ అనంత జలం కింద దాగివున్న అపారమైన కరుణ సముద్రం శ్రీరాముడు అని తెలుసుకోలేరు. త్యాగయ్యలు, శ్రీరామదాసులు, తులసీదాసులు, కబీర్ దాసులు తమ జీవితాలను రాముడు కోసం ఎందుకు ధారపోస్తారు? ఆ విషయం రాజమౌళి లాంటి మేధావులకు ఎందుకు అర్థం కాదు.
సముద్రం లాంటి శ్రీరాముడే అర్థం కానప్పుడు.. అంతకంటే అనంతమైన ఆకాశం లాంటి మాయ మోహన రూపుడు శ్రీకృష్ణుడు ఏం అర్థం అవుతాడు.
కృష్ణుడు అంటే వెన్న దొంగ మాత్రమే కాదు, వన్నెలు దోచుకున్న వాడు మాత్రమే కాదు.. కౌరవ సభకు దూత రూపంలో వెళ్లిన వాడు మాత్రమే కాదు.. కృష్ణుడు రథం నడిపే పార్థుడి తాలూకా, సారధి మాత్రమే అనుకునే వారంతా ఆయన బోధించిన గీతలోని 700 శ్లోకాలలో కనీసం ఒకదానికైనా అర్థం చెప్పగలుగుతారా.. అసలు భగవద్గీత అంటే అర్థం తెలియని వారికి ఉద్దవ గీత అనేది ఒకటి ఉంటుందని విషయం తెలుసా? గాలి బుడగ లాంటి జీవితంలో.. మనమెంత.. మన బతుకెంత.. రాముడు ఒక తేజ పుంజం. కృష్ణుడు అనంతకృష్ణ బిలం. రాజమౌళి లాంటివారు వెకిలి వ్యాఖ్యలు చేసినప్పటికీ చివరికి రాముడే వారికి సినిమా సరుకు. కృష్ణుడే వారికి కథ వస్తువు!