Raja Saab Story Leak : ప్రభాస్ అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ‘రాజా సాబ్’ కథ ఇదేనంటూ సోషల్ మీడియాలో ఒక స్టోరీ విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ముఖ్యంగా ట్రైలర్ విడుదలైన తర్వాత చాలా మంది నెటిజన్లు దీనిని షేర్ చేస్తూ, ఇదే అసలు కథ అయి ఉంటుందని ఊహిస్తున్నారు.
టాలీవుడ్ వర్గాల్లో, అంతటా జోరుగా ప్రచారంలో ఉన్న ఆ కథాంశం వివరాలు ఇలా ఉన్నాయి.
* కథాంశం (లీక్ అయిన ప్రకారం)
ఈ కథ ఎప్పుడో తాతల కాలం నాటి నేపథ్యంతో మొదలవుతుందట. తాత-మామ్మ పెళ్లి చేసుకుంటారు. అయితే, తాతకు ఎలాగైనా బాగా డబ్బులు సంపాదించి పైకి రావాలనే ఆశ బలంగా ఉంటుంది. కొద్దిరోజులు కాపురం చేసి, పిల్లలు పుట్టిన తర్వాత, ఆ డబ్బు సంపాదనే లక్ష్యంగా తాత కావాలనే మామ్మను వదిలేసి వెళ్ళిపోతాడు. దీంతో మామ్మ చేసేదేం లేక, పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేస్తూ, సంసారాన్ని ఎంతో కష్టంగా ఈదుతుంది.
ఇక డబ్బుల పిచ్చిలో ఉన్న ఈ తాత.. బాగా సంపాదించి, ఓ కోట లాంటి ఇంటిని కట్టుకొని అందులో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతాడు. అయితే, సంపాదించిన డబ్బులన్నీ ఆ కోటలోనే దాచిపెట్టి, అనుకోకుండా చనిపోతాడు.
* మనవడి ఎంట్రీ
ఇలా కష్టాల్లో ఉన్న తన మామ్మను చూసి, మనవడు (ప్రభాస్) “ఏంటి మామ్మా ఈ కష్టాలు?” అని ప్రశ్నిస్తాడు. అప్పుడు మామ్మ జరిగిన కథనంతా చెబుతూ… “మీ తాత ఇలా బాగా సంపాదించాలని వెళ్లి చనిపోయాడు. డబ్బులన్నీ ఆ ఇంట్లోనే పెట్టాడట” అని చెబుతుంది.
ఈ విషయం తెలుసుకున్న హీరో ప్రభాస్, తమ కష్టాలు తీర్చుకోవడానికి ఆ ఇంటికి వెళ్లి డబ్బులు తెచ్చుకోవాలని రకరకాల ప్రయత్నాలు చేస్తాడు.
* దెయ్యంగా మారిన తాత!
తాతకు డబ్బు అంటే పిచ్చి ఉండడంతో, చనిపోయిన తర్వాత కూడా దెయ్యంగా మారి ఆ కోటలోనే తిరుగుతుంటాడట. ప్రభాస్‌ను ఆ ఇంట్లోంచి డబ్బులు తీసుకెళ్లకుండా రకరకాలుగా అడ్డుకుంటూ, హింసిస్తుంటాడట. ఈ క్రమంలోనే హీరో, హీరోయిన్లతో నానా తంటాలు పడడం, తాతతో పోరాడటం జరుగుతుందని తెలుస్తోంది.
తాత దాచిన డబ్బుల కోసం ఫైట్ చేసే మనవడి కథే ‘రాజాసాబ్’ అంటూ సోషల్ మీడియాలో ఈ స్టోరీ ప్రస్తుతం అత్యంత వైరల్‌గా మారింది.
* నిజమైన కథ ఏమిటి?
ఈ లీక్ అయిన కథనం ఎంతవరకు నిజం? ఇది కేవలం ట్రైలర్ ఆధారంగా నెటిజన్లు అల్లిన ఊహాగానమా? లేక నిజంగానే సినిమా యూనిట్ నుంచి బయటకు వచ్చిన కథాంశమా? అన్నది తెలియాలంటే మాత్రం సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడక తప్పదు.
అయితే, ‘రాజాసాబ్’ కథ అంటూ మాత్రం ఇది లీక్ అయ్యి సోషల్ మీడియాలో ఆనోట ఈనోట వైరల్ అవుతోంది. ఈ హంగామా సినిమాపై అంచనాలను మరింత పెంచుతోంది అనడంలో సందేహం లేదు. అయితే కథ ఇది అన్న దానిపై డైరెక్టర్ మారుతి కానీ..చిత్రం యూనిట్ కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.


