
పేద ప్రజలు, దివ్యాంగులు, అనాథలకు సాయం చేయడంలో ప్రముఖ దర్శకుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ఎప్పుడూ ముందుంటారు. ఎందరో చిన్నారులకు గుండె ఆపరేషన్లు చేయించిన లారెన్స్.. చెన్నై అశోక్ నగర్లోని చారిటబుల్ ట్రస్టు ఏర్పాటు చేశారు. ఇందులో ఎంతో మంది అనాథలు, దివ్యాంగులు ఉంటున్నారు. ఈ ట్రస్ట్‌లో కరోనా కలకలం రేపింది. తమిళనాడులో విపరీతంగా విజృంభిస్తున్న వైరస్ ఈ ట్రస్ట్‌ను తాకింది. అక్కడ ఉంటున్న వారిలో 21 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయింది. ఇందులో 18 మంది చిన్నారులు, ముగ్గురు ఉద్యోగులు ఉన్నట్టు గుర్తించారు.
కరోనా వైరస్ బారిన పడిన వారందరినీ చెన్నై లయోలా కాలేజీలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో చికిత్స అందిస్తున్నారు. బాధితులంతా ఆరోగ్యంగానే ఉన్నారని ట్రస్టు వర్గాలు తెలిపాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ట్రస్టులో మిగిలిన వారికి కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.
నలుగురికి జ్వరం రావడంతో
తమిళనాడులో కరోనా వైరస్ రోజు రోజుకూ తీవ్ర రూపం దాలుస్తోంది. చెన్నై అశోక్ నగర్లో నివాసం ఉంటున్న ఇద్దరికీ కరోనా వచ్చిందని అధికారులు గుర్తించారు. దాంతో, ఆ ప్రాంతంలో ఉంటున్న ఇతరులకు కూడా వైరస్ సోకిందా? అన్న అనుమానంతో మరికొందరికి పరీక్షలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో లారెన్స్ ట్రస్ట్‌లో ఆశ్రయం పొందుతున్న నలుగురికి జర్వం రావడంతో శనివారం వారికి కరోనా పరీక్షలు చేయగా కరోనా నిర్దారణ అయింది. దాంతో, మిగతా వారికి కూడా పరీక్షలు నిర్వహించగా..ఏకంగా 21 మందికి వైరస్ సోకినట్టు తేలింది. వంట మనిషి నుంచి చిన్నారులు వైరస్ సోకిందని అధికారులు గుర్తించారు. దాంతో, ఆ ఆశ్రయాన్ని మూసివేసిన అధికారులు.. ఆ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.