
భారత్ లో కరోనా వ్యాపించడానికి ప్రధాన కారణం ఏమిటని ఎవరినైనా అడిగితే వారు వెంటనే చెప్పే జవాబు… ఢిల్లీ ప్రార్ధనలు. అంతకు ముందు కరోనా వైరస్ వుహాన్ లో పుట్టి కొద్దీ కాలంలోనే ప్రపంచ దేశాలకు పాకడానికి కారణం ఏమిటని అడిగితే సమాధానం ఉండదు. అయితే తాజాగా ఆ గుట్టును బయటపెట్టారు. అత్యంత వేగంగా చైనా నుంచి వివిధ దేశాలకు పాకిపోవడానికి కారణాలను శోధించి పట్టుకున్నారు. కరోనా వ్యాధి వుహాన్ లో విస్తారంగా వ్యాపించడానికి కారణం ది భైబూటింగ్ విందు. బైబూటింగ్ కమ్యూనిటీకి చెందిన 40వేల కుటుంబాలు కొత్త సంవత్సరం సందర్భంగా జనవరి 19 వ తేదీన పాట్ లక్ విందును ఏర్పాటు చేశారు. బైబూటింగ్ కమ్యూనిటీ ఇచ్చిన పాట్ లక్ విందులో 13,986 రకాల వంటకాలు వండి వడ్డించారు. ఇది రికార్డ్.
ఈ రికార్డ్ కోసం ప్రతి ఏడాది ఇలాంటి విందులు నిర్వహిస్తుంటారు. అయితే, దేశంలో కరోనా ఉందని, ఈ విందుకు అనుమతి ఇవ్వొద్దని కొందరు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా కుదరలేదు. ఈ కమ్యూనిటీ ప్రజలు అక్కడ 57 భవనాల్లో నివసిస్తున్నారు. ఈ విందు జరిగిన 15 రోజుల్లోపే 33 భవనాల్లో కరోనా వ్యాపించింది. అప్పటికే ఈ 40వేల కుటుంబాలకు చెందిన వారిలో చాలా మంది విందులో పాల్గొన్న తరువాత వివిధ దేశాలకు వెళ్లిపోయారు. వుహాన్ నుంచి ఇతర ప్రాంతాలకు కూడా వెళ్లిపోయారు. జనవరి 23 తరువాత ఉదృతి పెరిగింది. ఆ తరువాత ఈ బైబూటింగ్ కమ్యూనిటీ విందులో పాల్గొన్న వ్యక్తులే ఎక్కువగా కరోనా బారిన పడ్డారు. వీరి నుంచే ఇతరులకు, ఇతర ప్రాంతాలకు కరోనా వ్యాపించినట్టు చైనాలోని ప్రముఖ పత్రిక పేర్కొన్నది. అయితే, ఈ విషయాలను చైనా ఎందుకు దాచిపెట్టిందో తెలియడం లేదు. కరోనా కాలంలో 40వేల కుటుంబాలు ఒకచోట చేరి విందు చేసుకోవడం అంటే మాములు విషయం కాదు. కరోనా వేగంగా ప్రపంచంలో వ్యాపించడానికి ఇదొక కారణం. దీనిపై చైనా ప్రభుత్వం ఇప్పటికీ కూడా నోరుమెదపక పోవడం గమనార్హం.