Pushpa 2 The Rule : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘పుష్ప 2’ బాక్స్ ఆఫీస్ వద్ద రోజుకో అద్భుతాన్ని సృష్టిస్తూ ముందుకు దూసుకొని పోతుంది. రాజమౌళి కారణంగా పెరిగిన మన టాలీవుడ్ మార్కెట్ ని , అల్లు అర్జున్ మరో మెట్టు పైకి ఎక్కించాడు. ఎప్పుడైనా మనం మన తెలుగు సినిమాకి మూడు రోజుల్లో 600 కోట్ల రూపాయిలు వస్తాయని ఊహించామా..?, రాజమౌళి సినిమాకి వస్తాయని ఊహించే ఉంటాము కానీ, మన ఇండియన్ స్టార్ హీరోలకు ఇప్పట్లో సాధ్యం కాదని విశ్లేషకులు సైతం అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ కసి అసాధ్యం ని సుసాధ్యం చేసి చూపించింది. పుష్ప 2 చిత్రం వరల్డ్ వైడ్ గా మూడు రోజుల్లో 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తెలుగు వెర్షన్ వసూళ్ల కంటే ఎక్కువగా హిందీ వెర్షన్ వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా మ్యాట్నీ షోస్ నుండి జనాలకు టికెట్స్ దొరకని పరిస్థితి.
మూడు రోజుల్లో ఈ చిత్రానికి ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయో వివరంగా పరిశీలిస్తే, తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి మూడు రోజుల్లో 110 కోట్ల రూపాయిల షేర్ , 160 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తుంది. ఇది సాధారణమైన రికార్డు కాదు. ‘దేవర’ చిత్రానికి క్లోజింగ్ లో వచ్చిన వసూళ్లు, పుష్ప 2 చిత్రానికి కేవలం వీకెండ్ లో వచ్చాయన్నమాట. కర్ణాటక లో ఈ సినిమాకి ఇప్పటి వరకు 47 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా తమిళనాడు 15 కోట్ల రూపాయిల షేర్, 30 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ రాగా, కేరళలో 3 రోజులకు కలిపి 15 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చింది. ఇక్కడ మాత్రం ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ సినిమా ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే 60 కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టాలి. అది దాదాపుగా అసాధ్యం.
ఇక హిందీ వెర్షన్ వసూళ్ల విషయానికి వస్తే ఇప్పటి వరకు ఈ చిత్రానికి 300 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చినట్టు చెప్తున్నారు. అదే విధంగా ఓవర్సీస్ లో 120 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చిందట. అలా ఓవరాల్ గా ఈ చిత్రం మూడు రోజుల్లో 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీ వెర్షన్ వసూళ్లు నేడు వేరే లెవెల్ లో ఉండబోతుంది. మొదటి రోజు కంటే భారీ మార్జిన్ లీడ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ట్రేడ్ పండితులు. అదే విధంగా నేడు నైజాం ప్రాంతంలో ఈ చిత్రానికి 30 కోట్ల రూపాయిల గ్రాస్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయట. మొత్తం మీద నేడు పుష్ప విశ్వరూపాన్ని బాక్స్ ఆఫీస్ వద్ద మనమంతా చూడొచ్చు.