Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద నాలుగు రోజుల్లో సృష్టించిన విద్వంసం ని చూసి ఏళ్ళ తరబడి ట్రేడ్ ని పరిశీలిస్తున్న విశ్లేషకులకు సైతం మైండ్ బ్లాక్ అయ్యినంత పని అయ్యింది. మన ఇండియన్ సినిమా వెయ్యి కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఎక్కడి నుండి ఎక్కడి దాకా మన ఇండియన్ సినిమా ఎదిగింది అని జబ్బలు చర్చుకున్నారు, కాలర్ ఎగరేసుకున్నారు. కానీ నేడు మన ఇండియన్ సినిమా, అది కూడా మన తెలుగోడి సినిమాకి మొదటి వారం ముగిసేలోపు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వస్తుందని ఎవరైనా ఊహించారా?, కానీ ‘పుష్ప 2’ విషయంలో అది జరిగింది. తెలుగు వెర్షన్ కి సంబంధించి ఈ సినిమా ఫుల్ రన్ లో ఎంత రాబడుతుంది అనేది ఇప్పుడే చెప్పలేము కానీ, హిందీ వెర్షన్ లో మాత్రం అద్భుతాలు సృష్టించే అవకాశాలు ఉన్నాయి.
బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి సోమవారం రోజు, అనగా నేడు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 15 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చిందని అంటున్నారు. అంటే ఈ చిత్రానికి నేడు పూర్తి అయ్యేలోపు 50 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తుందని అంచనా వేస్తున్నారు. ఒక వర్కింగ్ డే లో కేవలం బాహుబలి 2 చిత్రానికి మాత్రమే ఈ స్థాయి వసూళ్లు వచ్చాయని, షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రానికి కూడా ఈ రేంజ్ వసూళ్లు రాలేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. దీనిని బట్టి ఈ చిత్రానికి కేవలం హిందీ వెర్షన్ లోనే వెయ్యి కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వస్తుందని ఇప్పటి నుండే అంచనాలు వేస్తున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు హిందీ వెర్షన్ లో 250 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వస్తాయట.
అంటే అప్పటికే 500 కోట్ల రూపాయిల నెట్ క్లబ్ లోకి పుష్ప 2 చిత్రం వెళ్లబోతుంది. షారుఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ చిత్రానికి ఇండియా వైడ్ గా హిందీ వెర్షన్ క్లోజింగ్ వసూళ్లు 650 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చింది. ‘పుష్ప 2’ చిత్రం రెండవ వీకెండ్ తో జవాన్ వసూళ్లు అతి తేలికగా దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఫుల్ రన్ లో హిందీ వెర్షన్ నెట్ వసూళ్లు 800 కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు ట్రేడ్ పండితులు. ఓవర్సీస్ లో కూడా ఈ చిత్రానికి తెలుగు వెర్షన్ కంటే హిందీ వెర్షన్ వసూళ్లు ఎక్కువగా వస్తున్నాయి. ఉదాహరణకి ఆదివారం రోజు హిందీ వెర్షన్ వసూళ్లు దాదాపుగా 1 మిలియన్ ఉంటే, తెలుగు వెర్షన్ వసూళ్లు మూడు లక్షల డాలర్లు ఉన్నాయి. దీనిని బట్టి ఈ సినిమా హిందీ ట్రెండ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.