https://oktelugu.com/

Sake Sailajanath: వైసీపీలోకి పిసిసి మాజీ ప్రెసిడెంట్?

రాష్ట్రవ్యాప్తంగా బలమైన నియోజకవర్గాల్లో ఇన్చార్జిలను మార్చాలని జగన్ భావిస్తున్నారు. సీనియర్ నేతలను రప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించాలని చూస్తున్నారు. అందులో భాగంగా అనంతపురం జిల్లాకు చెందిన కీలక నేతను వైసీపీలోకి ఆహ్వానించినట్లు సమాచారం.

Written By:
  • Dharma
  • , Updated On : December 9, 2024 / 11:02 AM IST

    Sake Sailajanath

    Follow us on

    Sake Sailajanath: సాకే శైలజానాథ్ వైసీపీలో చేరుతారా? కాంగ్రెస్ పార్టీని వీడనున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీకి అపార నష్టం కలిగింది. ఇప్పటికీ కోలుకోలేకపోతోంది. అయినప్పటికీ చాలామంది సీనియర్లు ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు. రఘువీరా రెడ్డి, సాకే శైలజానాథ్ లాంటి నేతలు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని ఉన్నారు. షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ బలపడుతుందని ఎంతో ఆశించారు. కానీ ఎటువంటి పురోగతి కనిపించడం లేదు. అందుకే పార్టీ మారేందుకు సిద్ధపడుతున్నట్లు ప్రచారం నడుస్తోంది. రఘువీరా రెడ్డికి జాతీయ స్థాయిలో పార్టీ కార్యవర్గంలో స్థానం లభించడంతో ఆయన అక్కడే కొనసాగనున్నారు. శైలజా నాథ్ మాత్రం తప్పకుండా పార్టీ మారుతారని టాక్ నడుస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లో మారిన సమీకరణల నేపథ్యంలో ఆయన వైసీపీ వైపు చూస్తున్నట్లు మాత్రం పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది.

    * ఎన్నికల్లో మారిన అభ్యర్థులు
    ఈ ఎన్నికల్లో సింగనమల నియోజకవర్గం నుంచి శ్రావణి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో పద్మావతి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో ఆమెపై బలమైన అభ్యర్థిని బరిలో దించాలని చంద్రబాబు భావించారు. అప్పట్లో శైలజానాథ్ పేరు ప్రధానంగా వినిపించింది. కాంగ్రెస్ పార్టీ నుంచి శైలజా నాథ్ ను రప్పించి టికెట్ ఇస్తారని పెద్ద ఎత్తున ప్రచారం అయితే నడిచింది. కానీ అనూహ్యంగా శ్రావణిని రంగంలోకి దించారు చంద్రబాబు. అదే సమయంలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మావతికి టికెట్ ఇవ్వలేదు. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులకు జగన్ టికెట్ ఇచ్చారు. కానీ కూటమి ప్రభంజనంలో ఆయన సైతం ఓడిపోయారు. ఇప్పుడు సింగనమల నియోజకవర్గం వైసీపీకి నాయకుడు అవసరం. అందుకే సాకే శైలజానాథ్ వైపు జగన్ చూస్తున్నట్లు సమాచారం.

    * రెండుసార్లు ఎమ్మెల్యేగా
    రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి వచ్చారు సాకే శైలజానాథ్. 2004 ఎన్నికల్లో తొలిసారిగా సింగనమల నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో సైతం రెండోసారి విజయం సాధించారు. కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగా కూడా కొనసాగారు. 2014లో రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ దారుణ పరాజయం చవిచూసింది. అప్పటినుంచి ఇప్పటివరకు కాంగ్రెస్ లోనే కొనసాగుతూ వచ్చారు శైలజనాథ్. 2022లో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు సింగనమల వైసీపీకి నాయకుడు కావడంతో జగన్ శైలజా నాథ్ కోసం ఎదురుచూస్తున్నట్లు సమాచారం. కొద్ది రోజుల్లో శైలజా నాథ్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరతారని తెలుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.