Puri Jagannath : సమాజం మీద అవగాహన ఉన్నోళ్లే క్రియేటర్స్, డైరెక్టర్స్ అవుతారు. కథలకు ముడి సరుకు మన చుట్టూనే ఉంటుంది. అది కళాత్మక దృష్టి ఉన్నోళ్లకు మాత్రమే కనిపిస్తుంది. దర్శకుడు పూరి జగన్నాధ్ సమకాలీన అంశాలపై పట్టుంది. అలాగే పూరి మంచి ఫిలాసఫర్ కూడా. పూరి జగన్నాధ్ మ్యూసింగ్స్ వింటే ఆ విషయం అర్థం అవుతుంది. లాక్ డౌన్ సమయంలో పూరి వరుసగా అనేక అంశాలపై మాట్లాడుతూ మ్యూసింగ్స్ విడుదల చేశారు.
జనాలు వాటికి అభిమానులైపోయారు. లైగర్ మూవీ పనుల్లో బిజీ అయ్యాక పూరి మ్యూసింగ్స్ ఆపేశారు. జనగణమన మూవీ కూడా ఆగిపోవడంతో పూరి కొత్త స్క్రిప్ట్స్ సిద్ధం చేసుకుంటున్నారు. విరామ సమయంలో మ్యూసింగ్స్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పూరి జగన్నాధ్ నుండి ‘తడ్కా’ పేరుతో ఒక మ్యూసింగ్ విడుదలైంది. ఇద్దరు వ్యక్తులకు మధ్యవర్తులు మనస్పర్థలు ఎలా సృష్టిస్తారో పూరి చెప్పాడు.
మనం ఒక వ్యక్తి దగ్గరికి మరొకడ్ని రాయబారానికి పంపుతాం. వాడు వెళ్లొచ్చాక… అక్కడ జరిగింది చెప్పడు. వాడి ఒపీనియన్ చెబుతాడు. చివర్లో అసలు నిజంగా సదరు వ్యక్తి ఏమన్నాడో చెబుతాడు. వాస్తవంగా జరిగిన దానికి తాలింపు జోడించి చెబుతారు. సమాజంలో సగం గొడవలకు కారణం ఈ తాలింపే. నీ ఒపీనియన్ అడిగితే చెప్పు, అడగకపోయినా అవతలి వ్యక్తి గురించి ఏదో చెప్పి వివాదాలు రేపవద్దు. సమాజంలో ప్రతి ఒక్కరు తాలింపు వేసేవాళ్ళే. గొప్ప వంటగాళ్ళే అంటూ… చాడీలు చెప్పే మేధావులకు చురకలు వేశాడు.
పూరి జగన్నాధ్ తడ్కా కాన్సెప్ట్ ఆయన తాజా అనుభవంలా ఉంది. లైగర్ మూవీ నష్టాల సర్దుబాటు విషయంలో పూరికి బయ్యర్లకు మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ గొడవలకు కమ్యూనికేషన్ గ్యాప్ అని పూరి నమ్ముతున్నట్లు ఉన్నారు. పూరితో బయ్యర్లకు ఏర్పడిన గొడవలకు ఈ తాలింపే అని ఆయన అభిప్రాయం కావచ్చు. కాగా లైగర్ మూవీతో పూరి అనేక వివాదాల్లో ఇరుక్కున్నారు. లైగర్ నిర్మాణంతో పాటు బిజినెస్ వ్యవహారాల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై పూరి, ఛార్మి, విజయ్ దేవరకొండ ఈడీ విచారణ ఎదుర్కొన్నారు.