
డాషింగ్ అండ్ డేరింగ్ డైరెక్టర్ ‘పూరి జగన్నాధ్’ లైగర్ తరువాత పవన్ కల్యాణ్ తో సినిమా చేసే అవకాశం ఉందని కొన్ని రోజులు, కేజీఎఫ్ స్టార్ యష్ తో పూరీ ఓ మాస్ యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తున్నాడని మరికొన్ని రోజులూ ఇలా పూరి తర్వాత సినిమా పై అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి. అయితే, పూరి మాత్రం లైగర్ తరువాత ఓ స్ట్రయిట్ బాలీవుడ్ సినిమా చేయబోతున్నాడు. కరణ్ జోహార్ బ్యానర్ లో ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో పూరి సినిమా ఉంటుందట.
బాలీవుడ్ స్టార్ హీరోలు కూడా పూరి జగన్నాథ్ పై ప్రత్యక అభిమానాన్ని చూపిస్తూ ఉంటారు. ముఖ్యంగా పూరి రాసే కథలు, మాటలు తనకు ఎంతో ఇష్టం అని గతంలో ద గ్రేట్ అమితాబ్ చెప్పాడు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి కూడా పూరి అంటే బాగా గురి. పూరి పోకిరిని రీమేక్ చేసి, ప్లాప్ ల వలయంలో నుండి సల్మాన్ బయటపడ్డాడు.
అప్పటినుండి పూరితో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నా.. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా పట్టాలెక్కలేదు. కానీ, పూరి సినిమాలను తానూ రెగ్యులర్ గా చూస్తుంటాను అని, అతని క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చుతాయి అని సల్మాన్ ఖాన్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పిన సంగతి తెలిసిందే. పైగా పూరికి ఫోన్ చేసి మరీ కథ ఉంటే చెప్పమని ఓపెన్ ఆఫర్ కూడా ఇచ్చాడు ఆ మధ్య.
కాబట్టి, పూరి చేసే బాలీవుడ్ సినిమాలో హీరో సల్మాన్ ఖాన్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది. కాకపోతే, పూరి చెప్పే కథ సల్మాన్ కి నచ్చాలి. కథ సెట్ అయితే, వీరి కలయికలో క్రేజీ సినిమా రావడం పక్కా. ఇక పూరి ప్రస్తుతం సల్మాన్ కోసం కథ రాసే పనిలో ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన పూరి, విజయ్ దేవరకొండ తో లైగర్ ను కూడా హిట్ చేసేలా ఉన్నాడు. లైగర్ హిట్ అయితే పూరి రేంజ్ పాన్ ఇండియాకి పాకిపోతుంది.