Puneeth Rajkumar: ఒకరు కాదు.. ఇద్దరు ఏకంగా నలుగురికి.. తను చనిపోయినా ఆయన కళ్లు ఇప్పుడు ప్రపంచాన్ని చూస్తున్నాయి. నాన్న కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ మరణంతో ఆయన చేసిన కళ్ల దానం స్ఫూర్తిగా ఆనాడే పునీత్ రాజ్ కుమార్ తన మరణానంతరం కళ్లు దానం చేయబోతున్నట్టు హామీపత్రం రాయించాడు. 2006లో ఈ మేరకు కళ్లు దానం చేస్తానన్నాడు. అదిప్పుడు ఆయన ఆకస్మిక మరణంతో నెరవేరింది.

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోతూ కూడా నలుగురి జీవితాల్లో వెలుగులు నింపడంపై ప్రశంసలు కురుస్తున్నాయి. పునీత్ ఎంత గొప్ప జన్మ అని అందరూ కీర్తిస్తున్నారు. సాధారణంగా చనిపోయిన వారి కళ్లతో ఇద్దరికి చూపునివ్వొచ్చు. కానీ పునీత్ కళ్లతో నలుగురికి నేత్రదానం చేశారు వైద్యులు. ఇదో అద్భుతమనే చెప్పాలి.
పునీత్ రాజ్ కుమార్ దానం చేసిన కళ్లలోని కార్నియాను నాలుగు భాగాలుగా చేసిన వైద్యులు నలుగురికి కంటిచూపు తెప్పించారు. సాధారణంగా ఇలా దానం చేసిన కళ్లను ఇతరులకు ట్రాన్స్ ప్లాంట్ చేస్తారు. ఒక వ్యక్తి కళ్లతో మాక్సిమమ్ ఇద్దరికి మాత్రమే చూపు దక్కుతుంది. అయితే పునీత్ కళ్లలోని కార్నియాలను వేరు చేసి నలుగురికి శస్త్రచికిత్స చేశారు వైద్యులు.
ఇలా పునీత్ చనిపోయినా కూడా ఆయన కళ్లు ఇప్పుడు లోకాన్ని చూస్తున్నాయి. ఒకేరోజు 48 గంటల్లోపే ఆయన కళ్లను నలుగురికి అమర్చిన బెంగళూరులోని నారాయణ నేత్రాలయ వైద్యులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. పునీత్ జన్మకు ఇదో సార్థకతగా చెప్పొచ్చు.