Chaitanya Master Sucide: కొరియోగ్రాఫర్ చైతన్యతో కొన్నాళ్లుగా కలిసి పని చేస్తున్న పల్సర్ బైక్ ఝాన్సీ కీలక విషయాలు వెల్లడించారు. ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఒక సంఘటన కారణమైందన్నారు. డిసెంబర్ 31 నైట్ చైతన్య ఓ ఈవెంట్ చేశారు. అందుకు కొందరు ఆర్టిస్ట్స్ ని తీసుకొస్తానని ఆర్గనైజర్స్ కి మాటిచ్చారు. అయితే ఆర్టిస్ట్స్ ఆయనకు హ్యాండ్ ఇచ్చారు. వస్తానన్న ఆర్టిస్ట్స్ ఈవెంట్ కి రాలేదు. దాంతో ఆర్గనైజర్స్ పేమెంట్ ఆపేశారు. దాదాపు ఆరు నుండి ఏడు లక్షల రూపాయల పేమెంట్ ఆగిపోయింది.
మిగతా ఆర్టిస్ట్స్ కి డబ్బులు ఇవ్వడానికి ఆయన అప్పులు చేశారు. ఒక అప్పు తీర్చడానికి మరొక అప్పు ఇలా చేసుకుంటూ పోయారు. సూసైడ్ వీడియోలో ఆయన సారీ చేసిన వ్యక్తులు అందరికీ డబ్బులు ఇవ్వాలి. అందుకే వాళ్ళ పేర్లు ప్రస్తావించారు. కానీ చైతన్య ఇలా చేసి ఉండాల్సింది కాదు. ఆయన డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చెబితే అర్థం చేసుకునేవారు. కూర్చోబెట్టి మాట్లాడాల్సింది. ఆయన నిర్ణయం వలన ఇప్పుడు కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు.
చైతన్య చాలా మంచి వ్యక్తి. తనకు ఉన్నా లేకున్నా పక్కవాళ్ల గురించి ఆలోచిస్తాడు. ఈవెంట్ ఆర్గనైజర్స్ డబ్బులు పేమెంట్ ఆపేయడం వలన ఒత్తిడి పెరిగి చైతన్య బలవన్మరణానికి పాల్పడ్డాడు. నేను ఈవెంట్ ఆర్గనైజర్స్ ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మా ప్రోగ్రాం నచ్చకపోతే మరోసారి పిలవకండి. అంతే కానీ పేమెంట్ ఆపవద్దు. దాని మీద అనేక మంది ఆర్టిస్స్ జీవితాలు ఆధారపడి ఉంటాయని పల్సర్ బైక్ ఝాన్సీ ఆవేదన చెందారు. తనకు ఢీ షోలో చేసే ఛాన్స్ ఇప్పిస్తానని చైతన్య ప్రామిస్ చేశాడని ఝాన్సీ చెప్పి బాధపడ్డారు.
ఏప్రిల్ 30 ఆదివారం నెల్లూరులోని ఒక హోటల్ లో చైతన్య ఆత్మహత్య చేసుకున్నారు. మరణానికి ముందు ఆయన ఒక సెల్ఫీ వీడియో రికార్డు చేశారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చనిపోతున్నట్లు వెల్లడించారు. పేరెంట్స్ క్షమించాలన్నారు. ఢీ షో నాకు ఫేమ్ తెచ్చిపెట్టింది. అయితే ఆర్థికంగా నిలబెట్టలేకపోయింది. జబర్దస్త్ లో ఉన్న రెమ్యూనరేషన్స్ కూడా ఢీ షోలో లేవు. అప్పు చేస్తే తీర్చే సత్తా ఉండాలి. నేను ఎంతో ట్రై చేశాను. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను… అని ఆ వీడియోలో చైతన్య ఆవేదన చెందారు. ఇక ఈ లైఫ్ చాలంటూ అందరికీ బై చెప్పారు. ఆయన సెల్ఫీ వీడియో గుండెలు బరువెక్కేలా చేస్తుంది.