Homeజాతీయ వార్తలుTelangana New Secretariat: కేసీఆర్ సార్.. ఈ శ్వేత సౌధం సరే: మన శైలి ఏది?

Telangana New Secretariat: కేసీఆర్ సార్.. ఈ శ్వేత సౌధం సరే: మన శైలి ఏది?

Telangana New Secretariat: కొత్త సచివాలయం 23 ఎకరాల్లో కట్టారు.. 1,600 కోట్లు ఖర్చుపెట్టారు. ప్రభుత్వ లెక్క ప్రకారం ఏడు అంతస్తుల్లో నిర్మాణమని లెక్క తేలింది. పైన మరో అంతస్తు నిర్మించి కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయాలి అనుకుంటున్నారు..ఇవీ నిన్న మొన్నటి వరకు తెలంగాణ నూతన సెక్రటేరియట్ పై వినిపించిన, కనిపించిన వార్తలు. ఒకటి, రెండు మీడియా సంస్థల మినహా మిగతావన్నీ కెసిఆర్ డప్పు కొట్టేందుకే పోటీ పడ్డాయి.. ప్రభుత్వం జాకెట్స్ భారీగా ఇవ్వడంతో మోత మోగించాయి. ఈనాడు లాంటి పెద్ద పత్రిక కూడా కెసిఆర్ భజన లో ఆరి తేరి తేరిపోయింది. ఆ నమస్తే గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.

ఆత్మగౌరవం ఎలా అయింది?

ఒక భవనం ఒక జాతి ఆత్మగౌరవం ఎలా అవుతుంది? తెలంగాణ ఠీవీ అట. గుజరాత్ లో కడితే గుజరాత్ ఠీవీ, తమిళనాడులో కడితే తమిళనాడు ఠీవీ అయిపోతాయా? తెలంగాణ ఠీవీ అని భవన నిర్మాణాల్లో కూడా ప్రతిబింబిస్తుందా? అసలు తెలంగాణ ఠీవీ అనగానేమి? ఏది తోచింది అది అచ్చేసి రాజభక్తిని ప్రదర్శించడమేనా జర్నలిజం అంటే? కొత్తగా నిర్మితమైన భవనాలను సైతం వాస్తు లోపాల సాకులతో, ఫైర్ సేఫ్టీ సాకులతో నేలమట్టం చేసి వందల కోట్ల ప్రజాధనాన్ని పాతరేసి, కొత్తగా మరో భవనం కడితే అది తెలంగాణ ఆత్మగౌరవం అయిపోయిందా? ఈ నిర్మాణల నిర్ణయాల మీద “ఆంధ్రజ్యోతి, వెలుగు” మినహా మిగతా పత్రికలు ఎప్పుడైనా ఒక నిష్పక్షపాత సమీక్ష వాక్యం నిజాయితీగా రాశాయా? “ఆయన కట్టించింది నిజాం వాస్తు శైలితో, మేము అధికారంలోకి వస్తే ఆ గుమ్మటాలను కూలగొడతామని” బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఆరోపిస్తే.. అది నిజాం శైలి కాదని, ఇంకా ఏవేవో వాస్తు సంప్రదాయాల మేలు కలబోత అని ఒక సెక్షన్ మీడియా డప్పు కొడుతోంది. అంతేకాదు ఎక్కడా కూడా నిజాం కాలంనాటి రాచరిక పోకడల వాస్తు శైలి అని రాసేందుకు వెనుకాడుతోంది.

నిర్మాణంలో అవి ఏవి?

సచివాలయ నిర్మాణంలో మొదట వనపర్తి సంస్థాన రాజప్రసాదం అన్నారు. మరో కోణంలో నిజామాబాద్ నీలకంఠేశ్వర గుడి అని చెప్పారు. గుజరాత్ లోని సలంగపూర్ హనుమాన్ ఆలయ శైలి అని కీర్తించారు. అవి సరిపోవని హిందూ, దక్కని, కాకతీయ నిర్మాణ శైలి అని సరికొత్త పదమిశ్రమాన్ని తెరపైకి తీసుకువచ్చారు. అంతేకాదు కాకతీయ నిర్మాణ రీతులు అంటూ ముక్తాయింపు ఇచ్చారు. భారత రాష్ట్ర సమితి జాతీయ రాజకీయాల్లో వేలు పెడుతోంది కాబట్టి మరో నాలుగైదు ప్రాంతాల వాస్తు ధోరణులను ఉదహరిస్తోంది. ఇండియన్, పర్షియన్, అరేబియన్ వాస్తుల ధోరణి మేలవింపు అని ఆ పార్టీ నాయకులు డబ్బా కొడుతున్నారు. పనిలో పనిగా రోమన్, అమెరికన్, ఆస్ట్రేలియన్ కల్పిస్తే సచివాలయానికి విశ్వముద్ర వేసినట్టయ్యేది. పాపం ఈ విషయాన్ని భారత రాష్ట్ర సమితి నాయకులు మర్చిపోయినట్టున్నారు.

సింహాలను కూడా వదిలిపెట్టరా?

రెండు గుమ్మటాల మీద జాతీయ చిహ్నాలైనా మూడు సింహాల బొమ్మలు ఉన్నాయి. కాబట్టి అవి తెలంగాణ ఆత్మగౌరవ పతకాలు అయిపోయాయి. అసలు మూడు సింహాలు ఏమిటి? జాతీయ చిహ్నం అంటే నాలుగు సింహాలు కాదా? ఓహో కేసీఆర్ గొప్పోడు కాబట్టి ఆ నాలుగో సింహాన్ని చంపేసి కేవలం మూడు సింహాలు మాత్రమే ఆత్మగౌరవ చిహ్నం చేశాడా? ఏది పడితే అది రాయడం మీడియాకు బాగా అలవాటుగా మారింది. వాచ్ డాగ్ పాత్ర పోషించలేక కీర్తి కండూతీ వ్యవహారంలో మునిగి తేలడం రివాజుగా మార్చుకుంది. పాత భవనాలను కూల్చేసి, నేలను చదును చేయడం చాలెంజింగ్ ఏమిటో ప్రభుత్వానికే తెలియాలి. దాన్ని యధావిధిగా రాసిన మీడియాకే తెలియాలి. ఎన్ని టన్నుల ఇనుము, ఇసుక, సిమెంట్, ఫర్నిచర్ వాడారు లెక్కలతో సహా చెప్పిన మీడియాకు మొదట్లో ఎంత అంచనా వ్యయం? తర్వాత ఎంతకు పెరిగింది వంటివి మచ్చుకైనా రాయలేదు.. రాయకూడదు. ఎందుకంటే డప్పు కొట్టడంలో ఆరితేరిపోయింది కాబట్టి. పేరుకేమో తెలంగాణ సాంస్కృతిక పతాక అని ముద్ర వేశారు. కానీ ఆ ఛాయలు లేవు. పైగా అంబేద్కర్ తెలంగాణ సచివాలయం అని పేరు పెట్టుకున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పాటించకుండా, కనీసం ఒక రాష్ట్ర గవర్నర్ ని కూడా ఆహ్వానించకుండా సచివాలయాన్ని ప్రారంభించారు. దీన్ని గుణాత్మక మార్పు అని మనం అనుకోవాలి. అంబేద్కర్ శైలిలో కేసీఆర్ పాలిస్తున్నాడు అని గొప్పలు చెప్పుకోవాలి. ఈ సచివాలయ గోడలకు చేర్యాల పెయింటింగ్స్ (వీటిని నకాషీలు అంటారు). ఇప్పుడు వాటిని వేలాడదీస్తారట. సచివాలయం ప్రారంభమైన తర్వాత ఈ ఆలోచన వచ్చిందట. అంటే వీటి కోసం వేటిని కూలగోడతారో మరి?

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular