Maa Election: ఎంతో ఉత్కంఠగా సాగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల సస్పెన్స్‌కు ఎట్టకేలకు తెరపడింది. ఆదివారం జరిగిన పోలింగ్‌లో మా అధ్యక్షుడిగా మంచు విష్ణు 106 ఓట్ల ఆధిక్యంతో నటుడు ప్రకాశ్ రాజ్‌పై విజయం సాధిచారు. అయితే, ప్రకాష్ రాజ్ రాజ్ నాన్ లోకల్ కావడం ఎన్నికల్లో ప్రభావం చూపించిందన్నది స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు, మెగా ఫ్యామిలీ పరోక్ష మద్దతు ఇచ్చిందే తప్ప.. ప్రకాష్ రాజ్ గెలుపు కోసం బలంగా నిలబడలేకపోయిందనే అభిప్రాయం వినిపిస్తోంది.
కాగా, చిరంజీవి మద్దతు ప్రకాష్ రాజ్‌కు ఉందని వినడమే తప్ప.. ఆయన ఎప్పుడూ బహిరంగంగా ప్రకటించలేదు. అయితే, ముందు నుంచి మెగా ఫ్యామిలీ తరఫున వాయిస్ వినిపిస్తూ.. ప్రకాష్ రాజ్‌కు మద్దతుగా నిలిచారు నాగబాబు. అయితే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఓటమికి ఆయన్నే బాధ్యుడిగా భావిస్తున్నారు.
నాగబాబునే ఎందుకు?
ఓ వైపు మంచు విష్ణు బయటి రాష్ట్రాల వారికి ఫ్లైట్ టికెట్లు వేయించి, ఎయిర్ పోర్ట్ నుంచి ట్రాన్స్‌పోర్ట్ కూడా పెట్టించి ఓటింగ్‌కు రప్పిస్తుండగా.. నాగబాబు తన కొడుకు వరుణ్ తేజ్, కూతురు నిహారికలను కూడా పోలింగ్ కేంద్రానికి రప్పించలేకపోయాడని.. మెగా ఫ్యామిలీలో మరికొందరితోనూ ఓటు వేయించడంలో విఫలమయ్యాడని ఇండస్ట్రీ వర్గాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతే కాకుండా, దిగ్గజ నటుడు కోట శ్రీనివాసరావుపై ఎన్నికల ముందు నాగబాబు తీవ్ర పదజాలం వాడటం, దూషించడం ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలుగా స్పష్టంగా కనిపిస్తున్నాయి.