Prudhvi Raj : ఇటీవల జరిగిన విశ్వక్ సేన్(Vishwak Sen) ‘లైలా(Laila Movie)’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కమెడియన్ పృథ్వీ వైసీపీ పార్టీ ని ఉద్దేశిస్తూ పరోక్షంగా వేసిన సెటైర్లు ఎంతటి దుమారం రేపాయో మనమంతా చూసాము. సినిమా ఫంక్షన్స్ లో రాజకీయాల గురించి మాట్లాడడం ఏమిటి అంటూ సోషల్ మీడియా లో వైసీపీ అభిమానులు పృథ్వీ(comedian prudhvi) పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇలాంటోళ్ళు మీ ఫంక్షన్ కి వచ్చి మాట్లాడుతుంటే, మీరెలా చూస్తూ ఊరుకున్నారు, ఇలాంటోళ్లను ఆహ్వానించినందుకు ఈ సినిమాని బ్యాన్ చేయాలంటూ పెద్ద ఎత్తున వైసీపీ అభిమానులు సోషల్ మీడియా లో ‘#BoycottLaila’ హ్యాష్ టాగ్ పై లక్షల సంఖ్యలోకి ట్వీట్స్ వేశారు. అంతే కాకుండా సినిమా విడుదలైన మొదటి రోజు మొదటి ఆట సమయంలోనే HD ప్రింట్ పైరసీ వదులుతామని వార్నింగ్ ఇచ్చారు. దీనికి భయపడిన విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసి క్షమాపణలు చెప్పాడు.
పృథ్వీ ఆరోజు అలా మాట్లాడినప్పుడు నేను, నిర్మాత అక్కడ లేమని, ముఖ్య అతిథి గా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారికి స్వగతం పలికేందుకు బయటకు వెళ్లామని, ఒకవేళ మేము చూసి ఉంటే మైక్ గుంజుకునే వాళ్ళం అంటూ విశ్వక్ సేన్ ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. అయితే విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్తే సరిపోదని, కామెంట్స్ చేసినవాడు క్షమాపణలు చెప్పాలంటూ వైసీపీ అభిమానులు డిమాండ్ చేయగా, పృథ్వీ క్షమాపణలు బదులుగా ఇంకా అసభ్యకరమైనా పదాజాలం తో వైసీపీ కార్యకర్తలను దూషించాడు. ఈ విషయం మూవీ టీం పవన్ కళ్యాణ్ వరకు తీసుకెళ్లారో ఏమో తెలియదు కానీ, నేడు ఆయన కాసేపటి క్రితమే మీడియా ముందుకొచ్చి క్షమాపణలు చెప్పాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘నాకు వ్యక్తిగతంగా ఎవరిపై కోపం లేదు. నా కామెంట్స్ కారణంగా వైసీపీ వాళ్ళు ఫీల్ అయ్యారు, నా వల్ల మూవీ కి నష్టం చేస్తున్నారు అంటున్నారు కాబట్టి నేను ఈ సందర్భంగా క్షమాపణలు చెప్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక నుండి ‘#BoycottLaila’ కాకుండా ‘వెల్కమ్ లైలా’ పేరుతో ట్వీట్స్ వేయండి అంటూ ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చాడు. కానీ వైసీపీ అభిమానులు అడిగిన వెంటనే క్షమాపణలు చెప్పి ఉంటే బాగుండేది, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్టు అయ్యింది పృథ్వీ రాజ్ పరిస్థితి. ఇప్పుడు ఆయన క్షమాపణలు చెప్పినప్పటికీ వైసీపీ అభిమానులు క్షమించే స్థాయిని దాటేసారు. చూడాలి మరి రేపు విడుదల అవ్వబోతున్న ఈ సినిమా ఎలాంటి పరిణామాలను ఎదురుకోబోతుంది అనేది. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే, ఎవరెన్ని నెగటివ్ కామెంట్స్ చేసినా, ఆ సినిమా వసూళ్లను అడ్డుకోలేరు. ఒకవేళ సినిమాలో విషయం లేకపోతే వైసీపీ అభిఉమానులు పండుగ చేసుకుంటారు. మరి ఈ చిత్రం వాళ్లకు పండుగ చేసుకునేలా చేస్తుందా?, లేదా నిరాశ మిగులుస్తుందా అనేది చూడాలి. బుక్ మై షో అడ్వాన్స్ బుకింగ్స్ అయితే అనుకున్న స్థాయిలో లేవు.