VB Rajendra Prasad- Acharya Atreya: నిర్మాత అంటే లెక్కలు చూసుకుని మెతుకు పోకుండా జాగ్రత్త పడతాడు. కానీ, ఆ లెజెండరీ నిర్మాత మాత్రం కొసరి కొసరి వడ్డించి కడుపు నింపేవారు. తన సినిమా కోసం పని చేసే ప్రతి ఒక్కరికి కడుపు నిండేదాకా అన్నం పెట్టి.. జేబుల నిండా డబ్బులు ఇచ్చి పంపిస్తారు. అన్నిటికీ మించి ఆయన విలువలున్న నిర్మాత, అలాగే ఆయన అభిరుచి గల దర్శకుడు, ఆయనే.. వి.బి.రాజేంద్రప్రసాద్. హీరో జగపతి బాబుకు తండ్రి. వి.బి.రాజేంద్రప్రసాద్ ‘అన్నపూర్ణ’ పేరుతో తొలి సినిమా తీశారు. అందరికీ అన్నం పెట్టే అన్నపూర్ణగానే తన నిర్మాణ సంస్థని ఆయన నడిపారు. అందుకే, జగపతి ఆర్ట్స్ అంటే.. నేటికీ ఒక గౌరవం ఉంది.
వి.బి.రాజేంద్రప్రసాద్ కి సినిమా అంటే ప్రాణం. సినిమాకి అమ్మానాన్న నిర్మాతే అంటుంటారు. సరిగ్గా పనిచేయలేకపోతే నాన్నలా దండించి, భోజనం దగ్గరికి వచ్చేసరికి అమ్మలా అన్నం పెట్టడం ఆయనకు అలవాటు. అయితే, రాజేంద్రప్రసాద్ తన నిర్మాణంలో విపరీతమైన వేగం పెంచిన రోజులు అవి. ఆ వేగంలో ఒకటికి పది సార్లు రాసుకుని, రిహార్సల్స్ చేసుకుని సినిమా తీసే అలవాటు ఆయనది. ఇలాంటి సమయంలో ఆయన ఆలస్యానికి పర్యాయపదం లాంటి ఆత్రేయను తన సినిమాకు రచయితగా తీసుకున్నారు.
Also Read: Puri Jagannadh- Charmi: పూరి-ఛార్మికి అసలు కష్టాలు మొదలు!
అయితే ఆత్రేయ సక్సెస్ మంత్రం నాణ్యతే. ‘సరైన పదం పడకపోతే గిలగిలా కొట్టుకునేవాడిని’ అంటూ ఆత్రేయే తన గురించి చెప్పేవారు. కానీ, ఆత్రేయకు రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తాడు అనే చెడ్డ పేరు వచ్చింది. ఎంత చెడ్డ పేరు వచ్చినా.. ఆచార్య ఆత్రేయ అగ్ర రచయితగానే తెలుగు సినిమా రంగాన్ని ఆ రోజుల్లో ఏలారు. ఇక రాజేంద్రప్రసాద్ కి – ఆత్రేయ కి జరిగిన ఒక సరదా సంఘటన గురించి తెలుసుకుందాం. ఆత్రేయ గారు పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది.
రాజేంద్రప్రసాద్ గారు ఆయన చేత పాట రాయించుకోడం కోసం,పెన్ పేపర్లూ పాడ్ తో ఉదయమే ఆత్రేయ దగ్గరకు వస్తాడు. ఆ పెన్ అలాగే ఉంటుంది. రాజేంద్రప్రసాద్ తెచ్చిన ఫ్రూట్స్ మాత్రం అయిపోతూ ఉంటాయి. ఈ లోపు సిగరెట్ పెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. అంతలో ‘ఆత్రేయ’ నిద్రలోకి జారుకుంటారు. అంతే! మళ్లీ సాయంత్రం అవుతుంది. ఆత్రేయ తీరిగ్గా లేస్తారు.
తిండీ తిప్పలు మానేసి పాట కోసం పడిగాపులు కాస్తున్న రాజేంద్రప్రసాద్ ను చూసి ‘ఏమండి.. ఫ్రెష్ష్ గా స్నానం చేసి వస్తాను. కట్ చేస్తే… స్నానం ముగుస్తోంది. ధవళ వస్త్రాలు ధరించి ఆత్రేయ గారు మళ్ళీ సిగరెట్ వెలిగిస్తారు. ‘ఎందాకా వచ్చాం అండి ?, ‘ఎక్కడికి రాలేదయ్యా ‘ అని రాజేంద్రప్రసాద్ సీరియస్ గా మొహం పెడతారు. ‘‘ఊరుకోండి. మనం మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా!’ అని పెన్ను అందుకుంటారు ఆత్రేయ.
ఒకపక్క మళ్లీ సిగరెట్లు మీద సిగిరెట్లు కాలిపోతూ ఉంటాయి. ఓ గంట తర్వాత.. పైకి లేచి, ‘ఈ రోజు ఆ మొదలు దొరకడం లేదులే అండి. ఒక వేడి వేడి కాఫీ తాగి వద్దాం’ ఇలా సాగుతుంది ఆత్రేయ పాటలు రాసే ధోరణి. వారాలు గడుస్తున్నా, ఆ పాట మాత్రం పూర్తి కాదు. మరోపక్క హోటల్ అద్దె పెరిగి పోతూ ఉంటుంది. రాజేంద్రప్రసాద్ గారికి – ఆత్రేయ గారికి మధ్య మంచి చనువుంది. ఇక వీరి మధ్య తిట్లూ- పొగడ్తలూ అతి సర్వసాధారణం. చివరకు ఆత్రేయను తిట్టి రాజేంద్రప్రసాద్ పాట రాయించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన ఓ ఇంటర్వ్యూలో చెబుతూ ఆత్రేయ అండ్ ఆయన టీమ్ ని మేపలేక కడుపు మండిపోయింది అని కామెంట్స్ చేశారు.
Also Read:AP- Telugu Language: తెలుగు వాడకపోతే ఏపీలో జైలుశిక్ష… ఎందుకంటే?