Dil Raju: FDC చైర్మన్, ప్రముఖ నిర్మాత దిల్ రాజు గత నెలలో ఇండియాలోనే పెద్ద చర్చకి దారితీసిన టాపిక్ గా మారిపోయాడు. సంక్రాంతికి తన నిర్మాణ సంస్థ నుండి రెండు సినిమాలు విడుదల చేశాడు. అందులో ‘గేమ్ చేంజర్’ చిత్రం ఫ్లాప్ అవ్వగా, ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం పెద్ద హిట్ అయ్యింది. ఒక సినిమాలో పోయిన డబ్బులు, మరో సినిమా నుండి వచ్చాయి. అయితే ఆయన తన ప్రొడక్షన్ టీంతో ఈ రెండు సినిమాలకు సంబంధించి పోస్టర్లు వేయడం, అవి ఒక రేంజ్ లో వైరల్ అవ్వడంతో ఐటీ అధికారుల కన్ను దిల్ రాజుపై పడింది. ఇంత డబ్బులు వస్తున్నట్టు చెప్తున్నారు, అసలు వీళ్ళు ఇన్కమ్ టాక్స్ కడుతున్నారా లేదా అని నాలుగు రోజుల పాటు దిల్ రాజు మరియు ఆయన కుటుంబ సభ్యుల ఇళ్లపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాలలో కేవలం 20 లక్షలు మాత్రమే దొరికింది.
అయితే సినిమాలు కాకుండా దిల్ రాజు కి ఉన్న ఇతర వ్యాపారాలకు సంబంధించిన లెక్కలు తీసుకొని మా ఆఫీస్ కి రావాలని ఐటీ అధికారులు దిల్ రాజుని ఆదేశించగా, కాసేపటి క్రితమే దిల్ రాజు లెక్క పత్రాలతో ఐటీ అధికారుల ముందు హాజరైనట్టు తెలుస్తుంది. కేవలం వ్యాపారాలు మాత్రమే కాకుండా డిస్ట్రిబ్యూషన్ ద్వారా సంపాదించిన లెక్కలపై కూడా ఆయన వివరణ ఇచ్చిన్నట్టు తెలుస్తుంది. నేడు ఆయన ఐటీ అధికారుల ముందు హాజరవ్వడంతో మరోసారి వార్తల్లో నిలిచాడు దిల్ రాజు. ఇదంతా పక్కన పెడితే ఈమధ్య వివాదాల్లో కూడా ఎక్కువగా చిక్కుతున్నాడు దిల్ రాజు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రం కనివిని ఎరుగని రేంజ్ లో లాభాలు తెచ్చిపెట్టడంతో పట్టరాని ఆనందంలో ఉన్న దిల్ రాజు, వరుసపెట్టి విజయోత్సవ సభలు ఏర్పాటు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్స్ లో ఆయన ఇండస్ట్రీ కి సంబంధించిన అనేక రహస్యాలు బయటపెట్టి సంచలనం సృష్టించాడు.
ముఖ్యంగా ‘గేమ్ చేంజర్’ చిత్రానికి నెగటివ్ టాక్ వచ్చినప్పటి నుండి ఆయన ఆ సినిమాని పూర్తిగా పక్కన పెట్టేయడం అభిమానులకు తీవ్రమైన కోపాన్ని తెచ్చిపెట్టింది. కనీసం ఆ సినిమా గురించి కనీసం ఒక ప్రెస్ మీట్ ని కూడా ఏర్పాటు చేయలేకపోయాడు. పైగా ఆ చిత్రం మీద ఎవరైనా సెటైర్లు వేస్తే పగలబడి నవ్వడం, పరోక్షంగా ఇక నుండి కాంబినేషన్స్ జోలికి వెళ్ళను, బుద్ధొచ్చింది అంటూ కామెంట్స్ చేయడం వివాదాలకు దారి తీసింది. సోషల్ మీడియా లో దిల్ రాజు ప్రవర్తన పై రామ్ చరణ్ అభిమానులు అసంతృప్తి తో వేస్తున్న ట్వీట్స్ ని కూడా ఆయన పట్టించుకోవడం లేదు. తనకి నచ్చినట్టుగా ఏది తోచితే అది చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దిల్ రాజు కి హిట్స్, ఫ్లాప్స్ కొత్తేమి కాదు. కానీ ఈ సంక్రాంతి మాత్రం ఆయన ప్రవర్తనలో చాలా మార్పులు తెచ్చిపెట్టింది అంటూ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు.