Producer Ashwini Dutt: సినిమా నిర్మాణం జూదంతో సమానం. పది హిట్ సినిమాల లాభం ఒక్క ఫ్లాప్ మూవీతో పోవచ్చు. సీనియర్ నిర్మాత అశ్వినీ దత్ ఓ చిత్రంతో మొత్తంగా మునిగిపోయాడట. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు మెహర్ రమేష్ శక్తి టైటిల్ తో సోషియో ఫాంటసీ మూవీ చేశారు. భారీ తారాగణం నటించిన ఈ చిత్రాన్ని అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కించారు. శక్తి డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కనీస వసూళ్లు రాబట్టలేకపోయింది. ఆ చిత్రం తెచ్చిపెట్టిన నష్టాల గురించి తాజాగా అశ్వినీ దత్ స్పందించారు.
నా కెరీర్లో శక్తి బాగా నిరాశపరిచిన చిత్రం. ఆ సినిమా దెబ్బకు పరిశ్రమ నుండి వెళ్ళిపోదాం అనుకున్నాను. శక్తి చిత్ర నిర్మాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. ఏకంగా రూ. 32 కోట్ల నష్టం వచ్చింది. అది మామూలు విషయం కాదన్నారు. ఒక్క చిత్రంతో అంత పెద్ద మొత్తంలో పోవడం భారీగా దెబ్బకొట్టిందన్నారు. అలాగే చూడాలని ఉంది చిత్రాన్ని హిందీలో అల్లు అరవింద్ తో కలిసి నిర్మించారు. మొత్తంగా రూ. 12 కోట్ల నష్టం వచ్చింది. చెరో ఆరు కోట్లు నష్టపోయాం. అప్పుడు ఫార్మ్ లో ఉన్నాం కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకోగలిగాము.. అని అశ్వినీ దత్ అన్నారు.
నాకు ప్లాప్ మూవీ పడితే చిరంజీవి కథ సిద్ధం చేసుకోండి మూవీ చేద్దాం అంటారు. నాగార్జున కూడా అంతే. నేను అడిగితే మిగతా వాళ్ళ చిత్రాలు పక్కన పెట్టి సినిమాలు చేసే హీరోలు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. పిల్లలు పెద్దయ్యాక నిర్మాతలుగా మారారు. మంచి చిత్రాలు తెరకెక్కించడంలో వారిని ప్రోత్సహిస్తున్నానని అశ్వినీ దత్ అన్నారు. అశ్వినీ దత్ కూతుళ్లు స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మాతలుగా ఉన్న విషయం తెలిసిందే.
ప్రస్తుతం అశ్వినీ దత్ తన బ్యానర్ లో ప్రాజెక్ట్ కే వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేస్తున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ 2024 సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తుంది. దిశా పటాని మరొక హీరోయిన్. అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు.