
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ బుధవారం ఉదయం గుండెపోటుతో విశాఖలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కొద్ది రోజులుగా చికిత్స తీసుకుంటునప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి విషయమించడంతో వెంటిలేటర్ పై చికిత్స అందించినా ఆయన ప్రాణాలను వైద్యులు కాపాడలేయారు.
ప్రస్తుతం ఆయన వయసు 66 సంవత్సరాలు. మాజీ లవర్ బాయ్ తరుణ్ కథానాయకుడిగా సీనియర్ దర్శకులు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో ‘సఖియా నాతో రా’ సినిమాని నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ నిర్మించారు. అయితే ఆయన నిర్మాతగా పెద్దగా సక్సెస్ లు అందుకోలేదు. గతంలో కూడా ఆయన ‘ఈ పిల్లకి పెళ్ళవుతుందా’, ‘కలికాలం ఆడది’, ‘డామిట్ కథ అడ్డం తిరిగింది’, ‘ఈ దేశంలో ఒకరోజు’ వంటి సినిమాలను ఆయన నిర్మించారు.
అలాగే దర్శకుడు మారుతితో కలిసి ‘బెస్ట్ యాక్టర్స్’ అనే సినిమాని కూడా అన్నంరెడ్డి నిర్మించారు. ఇక మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్, సాయి పల్లవి జంటగా నటించిన ‘అనుకోని అతిథి’ సినిమాని కృష్ణకుమార్ తెలుగులో అనువదించారు. ఈనెల 28న ఆహా ఓటీటీ వేదికలో ఆ సినిమా రిలీజ్ కాబోతుంది.
కృష్ణకుమార్ భార్య జ్యోతి కొన్నేళ్ళ క్రితం చనిపోయారు.
ఆమె హీరోయిన్ కూడా. ‘వంశ వృక్షం’, ‘తూర్పు వెళ్ళే రైలు’, ‘మరో మలుపు’, ‘మల్లె పందిరి’ తదితర సినిమాలలో జ్యోతి కీలక పాత్రలను పోషించింది. భార్య చనిపోయిన దగ్గర నుండి కృష్ణకుమార్ మానసికంగా బాగా ఇబ్బంది పడుతున్నారని ఆయన కుమార్తె చెప్పారు. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము