Priyamani: హీరోయిన్ అంటే.. నాలుగు సీన్లు.. ఐదు పాటలు.. కురచ దుస్తులు… ము* లేదా బె* సన్నివేశాలు. ఇంతే.. ఇలానే మార్చేశారు.. కొందరు మినహా అందరి హీరోయిన్ల పరిస్థితి ఇలాంటిదే. మేల్ డామినేషన్ ఉన్న ఇండస్ట్రీలో ఇంతకుమించి వారికి ఏం గౌరవం లభిస్తుంది కనుక. ఇలాంటి పరిస్థితులనూ కొందరు తమకు అనుకూలంగా మలుచుకుంటారు. తమ నటనను ప్రదర్శించే అవకాశాలను కల్పించుకుంటారు. అలాంటి వారిలో ప్రియమణి ఒకరు. ఇటీవల ఆర్టికల్ 370, భామ కలాపం-2 ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తన నటనతో అలరించారు. అయితే ప్రియమణి ఇటీవల చేసిన ఒక పని ఆమెను వార్తల్లో వ్యక్తిని చేసింది. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే..
ప్రియమణి ఇటీవల కేరళ రాష్ట్రంలోని ఓ ప్రముఖ ఆలయాన్ని సందర్శించింది. అద్భుతమైన కానుకను అందించింది. పెటా సంస్థలో ప్రియమణి సభ్యురాలు. ఆమె మూగజీవాలపై తన ప్రేమను వ్యక్తపరుస్తూనే ఉంటుంది. అలాంటి ప్రియమణి కేరళలోని ఆ గుడికి ఇచ్చిన కానుక హాట్ టాపిక్ గా మారింది. కేరళ రాష్ట్రంలోని ఆలయానికి ఆమె ఒక రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చింది. ఆ రోబోటిక్ ఏనుగు పేరు మహాదేవన్. కేరళ రాష్ట్రంలోని వచ్చి ప్రాంతంలో ఉన్న త్రీకైల్ మహాదేవన్ ఆలయానికి ప్రియమణి ఏనుగును విరాళంగా అందించింది.
ఈ మహాదేవన్ ఆలయంలో ఎలాంటి దైవకార్యానికైనా ఏనుగులను అసలు ఉపయోగించరు. మతపరమైన కార్యక్రమాల్లో మూగజీవాలను ఉపయోగించకూడదని దేవస్థానం నిర్ణయించడమే ఇందుకు కారణం. పైగా ఏనుగులు ఒక్కొక్కసారి విచిత్రంగా ప్రవర్తిస్తుంటాయి. మావటి, భక్తులను గాయపరుస్తుంటాయి. కొన్నిసార్లు చంపేస్తుంటాయి కూడా. వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడి ఆలయ కమిటీ అధికారిక దైవ కార్యక్రమాల్లో ఏనుగులను ఉపయోగించకూడదని నిర్ణయించింది. ఈ ఆలయ కమిటీ చేసిన పనిని పెటా అభినందించింది. ఈ విషయం తెలుసుకున్న ప్రియమణి ఈ ఆలయాన్ని సందర్శించింది. రోబోటిక్ ఏనుగును బహుమతిగా ఇచ్చి, ఆలయ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసింది. ఇక ఈ రోబోటిక్ ఏనుగుకు ఆలయ నిర్వాహకులు వినూత్నంగా ఇసుక, మట్టితో ఘన స్వాగతం పలికారు. “మూగ జీవాలను మనుషులుగా మనం కాపాడాలి. అవి బాగుంటేనే జీవ వైవిధ్యం కొనసాగుతుంది. జంతువులకు హాని తలపెట్టకుండా ఉండడమే మన ధర్మం. అవి బాగుంటేనే సంస్కృతి కూడా బాగుంటుందని” ప్రియమణి రోబోటిక్ ఏనుగును ఆలయ కమిటీకి అందజేస్తూ వ్యాఖ్యానించింది. కాగా, ప్రియమణి చేసిన పని పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.