
Rajamouli – Prem Rakshith : మా రాజమౌళి గొప్పోడు. మా కీరవాణి ఉద్దండుడు. చంద్రబోస్ ఇరగదీసాడు. కాలభైరవ కరగదీసాడు. రాహుల్ సిప్లిగంజ్ మెరుపులా మెరిశాడు.. నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన దగ్గరనుంచి దేశవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ టీం కు శుభాకాంక్షలు వెల్లువలా సాగుతున్నాయి.. బహుశా ఇప్పట్లో ఇవి ఆగకపోవచ్చు. కానీ ఇంతటి పురస్కారానికి అర్హమైన పేరు మరొకటి ఉంది. ఆపేరే ప్రేమ్ రక్షిత్.
ఎక్కడో తమిళనాడు ప్రాంతంలో పుట్టిన ఈ వ్యక్తి.. డ్యాన్స్ నే ప్రాణంగా ప్రేమించిన ఈ వ్యక్తి.. ఇవాళ ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నాడు అంటే అతని ప్రతిభ కారణం. అన్నింటికీ మించి ఆ ప్రతిభను గుర్తించిన రాజమౌళి కారణం. యమదొంగ సినిమాకు ముందు రాజమౌళి సినిమాలో పెద్దగా స్టెప్పులు ఉండేవి కాదు. పాటలు కూడా కీరవాణి వల్ల జన రంజకంగా ఉండేవి.. వీటివల్ల రాజమౌళికి ఎక్కడో చిన్న వెలితి ఉండేది. దాన్ని పూర్తి చేసుకునేందుకు ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేసినా ఉపయోగం లేకుండా పోయింది.
అప్పట్లో ఎన్టీఆర్ కు సరైన హిట్టు లేదు. కృష్ణవంశీ రాఖీ రూపంలో హిట్ ఇచ్చినప్పటికీ.. అది ఎన్టీఆర్ దాహాన్ని మాత్రం తీర్చలేదు. పైగా రాఖీ సినిమాలో ఎన్టీఆర్ హరికృష్ణ ను మించి బరువు ఉండటంతో జనం హేళన చేశారు. ఈ క్రమంలో తనకు అర్జెంటుగా హిట్ కావాలని ఎన్టీఆర్ రాజమౌళిని కలవడం, అప్పటికే యమదొంగ సినిమా పైప్ లైన్ లో ఉండటంతో సెట్స్ మీదకు వెళ్ళింది. కాకపోతే ఎన్టీఆర్ ను బరువు తగ్గాలని రాజమౌళి చూపించాడు. అనుకున్నట్టుగానే ఎన్టీఆర్ లైపో సర్ఫెక్షన్ తో బరువు తగ్గాడు. ఇంతవరకు బాగానే ఉన్నా పాటలు, కొరియోగ్రఫీ విషయానికి వచ్చేసరికి రాజమౌళికి ఎక్కడో చిన్న అనుమానం ఉంది.
ఈ చర్చ సందర్భంగానే రాజమౌళికి ఎవరో ప్రేమ్ రక్షిత్ గురించి చెప్పారు. వెంటనే అతని పిలవడం, అతడు వేసిన స్టెప్పులు రాజమౌళికి నచ్చడం చకచకా జరిగిపోయాయి. సీన్ కట్ చేస్తే యమదొంగ సినిమా కొరియోగ్రఫీ మొత్తం ప్రేమ్ రక్షిత్ కే రాజమౌళి అప్పగించాడు. యమదొంగ సినిమాలో నాచోరే, యంగ్ యమ, నాగ మల్లి, రబ్బర్ గాజులు, ఓలమ్మి తిక్క రేగిందా.. ఈ పాటలు ఎంత జనాదరణ పొందాయో చెప్పాల్సిన అవసరం లేదు. వీటికి తెర వెనుక కృషి చేసింది ప్రేమ్ రక్షిత్. ఇక అప్పటినుంచి ప్రేమ్ రక్షిత్ చెయ్యి రాజమౌళి వదలలేదు.
తాజాగా నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు రావడం వెనుక ప్రేమ్ రక్షిత్ కృషి చాలా ఉంది. ఈ ఒక పాటకు సుమారు 82 రకాల వేరియేషన్లు క్రియేట్ చేశాడు అంటే అతని కొరియోగ్రఫీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు ప్రేమ్ కంపోజ్ చేసిన రెండో వేరియేషన్ ను రాజమౌళి ఓకే చేశాడు. లాస్స్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్లో ఆస్కార్ అవార్డును సగర్వంగా ఓడిసిపట్టాడు. సాధారణంగా దర్శకులు తమ టెక్నికల్ టీం ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటారు. కానీ రాజమౌళి విషయంలో అలా ఉండదు. ఒక విక్రమార్కుడు సినిమాకు తప్పించి ఆయన అన్ని సినిమాలకి సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తారు. కీరవాణి మ్యూజిక్, విజయేంద్ర ప్రసాద్ స్టోరీ, స్టయిలింగ్ రమా రాజమౌళి, లైన్ ప్రొడ్యూసర్ కార్తికేయ, కొరియోగ్రఫీ ప్రేమ్ రక్షిత్ ఇలాంటి టీం ఉంది కాబట్టే రాజమౌళి ఆస్కార్ ను ఒడిసి పట్టగలుగుతున్నాడు.