Naresh vs Prakash Raj: మా ఎన్నికల్లో మళ్ళీ వివాదం వేడి మొదలైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ‘మా’ మెంబర్స్ సిగ్గుపడేలా నరేశ్ ప్రవర్తన ఉందని ప్రకాష్ రాజ్ ఆవేశంగా మాట్లాడారు. నరేశ్ ఒక అహంకారి అని చెప్పిన ప్రకాష్ రాజ్.. నరేశ్ కి వార్నింగ్ ఇస్తూ.. ‘నరేశ్ నువ్వు ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలి, లేదంటే మేము అలాగే రియాక్ట్ అవ్వాల్సి వస్తోంది’ అంటూ ప్రకాష్ రాజ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.

మొత్తానికి ‘మా’ అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంటడంతో పోటీ చేస్తున్న ‘ప్రకాశ్ రాజ్ – విష్ణు’ల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎవరికీ వారు ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచుతూ ఘాటు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే, ఉన్నట్టు ఉండి ప్రకాష్ రాజ్.. నరేశ్ పై విరుచుకు పడటానికి ముఖ్య కారణం.. ‘ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి తెలుగు వాడు’ కాదంటూ నరేశ్ వ్యాఖ్యలు చేశాడు.
అయితే, ఈ వ్యాఖ్యలకు బాధ పడిన ప్రకాష్ రాజ్ మండిపడుతూ.. ‘నేను తెలుగు వ్యక్తిని కాదు, ఇదే వారి ఆరోపణ. కానీ నేను తెలుగు మాట్లాడినంతగా మంచు విష్ణు ప్యానల్ లో ఎవరూ తెలుగు మాట్లాడలేరు. నాకు తెలుగు అంటే ఇష్టం. ఎందుకంటే.. నన్ను పెంచింది తెలుగు భాషే. తెలుగు ప్రేక్షకులే నన్ను బాగా ఆదరించారు. అందుకే, ‘మా’ అసోసియేషన్ కోసం బాధ్యతతో పనిచేయాలనే ఆశతో ఆసక్తితో పోటీ చేస్తున్నాను.
అందుకే, ఇన్నాళ్లు నేను చాలా సహనంగా ఉన్నాను. కానీ.. నాకు అలాగే మా సభ్యుల్లో ఉన్న ప్రతి వ్యక్తికీ ఆత్మాభిమానం ఉంది. దాన్ని బాధ పెట్టకండి. నిజానికి నేను ‘మా’ ఎన్నికల గురించి ప్రశ్నించినందుకే నా పై విమర్శలు చేశారు. సౌమ్యంగా ఉన్నాను, ఐతే కోపంగా మాట్లాడడం నాకు కూడా తెలుసు అనే విషయం గ్రహించండి.
అయినా సినిమా ఎన్నికల్లోకి జగన్, కేసీఆర్, భాజపాలను ఎందుకు లాగుతున్నారో నాకు అర్ధం కావడం లేదు. సరే… వైఎస్ జగన్ మీ బంధువైతే ‘మా’ ఎన్నికలకు అయన వస్తారా ? ఇక కేటీఆర్ ఫ్రెండ్ అంటూ ఏదో చెబుతారు. అయినా రెండు సార్లు హలో చెబితే కేటీఆర్ ఫ్రెండ్ అయిపోతారా? ఒక్కటి మాత్రం చెప్పగలను. ఓట్ల సునామీలో మంచు విష్ణు ప్యానల్ కొట్టుకుపోతుంది’ అంటూ ప్రకాష్ రాజ్ విరుచుకుపడ్డాడు.