‘నువ్వు నందా అయితే.. నేను బద్రి.. బద్రినాథ్’ బద్రి సినిమాలో ఈ డైలాగ్‌ను ఎప్పటికీ మరిచిపోలేనని ప్రకాశ్ రాజు చెప్పుకొచ్చారు. అందుకే ఆ పాత్రలను సృష్టించిన పూరి జగన్నథ్‌కి మరోసారి థ్యాంక్స్ చెప్పాను అన్నారు. ఇంకా ఆయన మాటల్లోనే.. ‘వకీల్‌సాబ్’ విషయంలోనూ నా పాత్రకి నందకిశోర్ అనే పేరు పెట్టడం దర్శకుడు శ్రీరామ్ వేణు మాస్టర్ స్ట్రోక్ అని భావిస్తాను. సినిమాలో నందా జీ అని పవన్‌కల్యాణ్ డైలాగ్ చెప్పేసరికి ప్రేక్షకులు ‘బద్రి’ సినిమానే గుర్తుచేసుకున్నారు. ఒక సినిమా మంచి జ్ఞాపకాలను తీసుకురావడం మంచి పరిణామమే కదా’ అని అన్నారు.
‘‘పవన్ ఆలోచనలు ఎలా ఉంటాయో.. దానికి సరిపడే కథ ఇది. అభిమానులు పాటలు, ఫైట్లను ఆశిస్తారు. సో.. దాంతో వాటిని కూడా జోడించి సినిమాకు అదనపు హంగులు తెచ్చారు. థియేటర్‌లో సినిమాను మాత్రమే ప్రేక్షకులు చూస్తున్నారు. కానీ.. దాని వెనుక చాలా పెద్ద ప్రయాణం ఉంది. హోంవర్క్.. రిహార్సల్స్ ఇలా చాలా వర్క్ ఉంటుంది. లంచ్‌కి అందరం కూర్చొని స్క్రిప్ట్ గురించి డిస్కస్ చేసేవారం. అందరం అంతలా హార్డ్‌వర్క్ చేశాం కాబట్టే సినిమా ఇంతలా ప్రేక్షకులకు చేరువైంది. మహిళల నేపథ్యంలో సాగే ఇలాంటి కథలు ఇంకా రావాలి. మహిళలను గౌరవించాలి. తల్లిదండ్రుల పెంపకంలోనూ మార్పులు రావాలి”.
అంతేకాదు.. తనకూ, పవన్‌కు రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయని వెల్లడించారు ప్రకాశ్ రాజ్. ‘‘నేను పవన్‌ను ప్రేమిస్తాను కాబట్టి నాకలా ఉంటుంది. మా ఇద్దరి భావజాలం ఒక్కటే. జనాలకు మంచి చేయడం.. జనం పట్ల, దేశం పట్ల, తెలుగువాళ్ల పట్ల మాకున్న ప్రేమ ఒక్కటే. ఒక నాయకుడికి ఉన్న బలం, ఓపిక పవన్‌కు ఉన్నది” అంటూ చెప్పారు.