Maa Elections టాలీవుడ్ లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా నడిచిన అంశం ఏదైనా ఉంది అంటే అది మా అసోసియేషన్ ఎన్నికలే. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకొని రచ్చకెక్కారు. అయితే ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా నిలబడిన మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. కానీ ఎలక్షన్స్ అనంతరం కూడా మా ఎన్నికలు వివాదం రోజురోజుకూ ఓ కొత్తమలుపు తీసుకుంటోంది.

ఈ మేరకు తాజాగా ప్రకాశ్‌రాజ్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ తరుపున గెలిచిన అందరూ రాజీనామాలు చేయడం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. మా ఎన్నికల్లో చాలా రౌడీయిజం చేశారని, నరేష్ ప్రవర్తన సరిగ్గా లేదని ప్రకాష్ అన్నారు. సగం సగం కార్యవర్గం వలన ఉపయోగం ఉండదని… మా సంక్షేమం కోసం ఎంతో అలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాం. మంచు విష్ణు ఎన్నో హామీలు ఇచ్చారు. సంక్షేమం విషయంలో ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అందుకోసమే ఒక డీసెంట్ డెసిషన్ తీసుకున్నాం. మీకు అడ్డురాకూడదని ఈ నిర్ణయం తీసుకున్నాం అంటూ ప్రకాష్ రాజ్ చెప్పారు.
ఎన్నికలు అయిన వెంటనే నేను మా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేశాను. అయితే, మంచు విష్ణు ఆ రాజీనామా ఆమోదించలేదు. నేను అసోసియేషన్ లో తిరిగి ఉండాలని అన్నారు. నేను కచ్చితంగా నా రాజీనామా వెనక్కి తీసుకుంటాను. కానీ, నాది ఒక కండిషన్ అది ఏమిటి అంటే… నాన్ లోకల్ అనే పదాన్ని వెనక్కి తీసుకోవాలి అని ప్రకాష్ రాజ్ కోరారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియా లో ట్రెండింగ్ గా మారాయి.