Prakash Raj: మా ఎన్నికల వివాదం రోజురోజుకూ ఓ కొత్తమలుపు తీసుకుంటోంది. ప్రకాశ్‌రాజ్‌కు పోటీగా నిలబడిన మంచు విష్ణు గెలిచిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మా కు పోటీగా మరో అసోసియేషన్‌ను ప్రకాశ్‌రాజ్ సహా మరి కొంత మంది సభ్యులు స్థాపించనున్నట్లు సమాచారం. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ప్రకాశ్‌రాజ్ మీడియా ముందుకు రానున్నారు. ఇప్పటికే ప్రకాశ్‌రాజ్ సహా నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేశారు.
మాజీ అధ్యక్షుడు శివాజీ రాజా కూడా వారి దారిలోనే నడుస్తానని స్పష్టం చేశారు. దీంతో మా లో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు తన రాజీనామా వెనక లోతైన అర్థం ఉందని త్వరలోనే ఈ విషయంపై క్లారిటీ ఇస్తానని ట్విట్టర్ వేదికగా ప్రకాశ్‌రాజ్ తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త కూటమి పెట్టే అంశంపై మరింత చర్చలు మొదలయ్యాయి. మరోవైపు ప్రకాశ్‌రాజ్ ప్యానెల్లో అందరూ రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జరిగిన ఎన్నికల్లో మొత్తం 18 కార్యవర్గ సభ్యుల్లో 10 మంది విష్ణు ప్యానెల్‌కు చెందిన అభ్యర్థులు విజయం సాధించగా.. 8 మంది ప్రకాశ్‌రాజ్ అభ్యర్థులు గెలిచారు. ఫలితాలు వచ్చిన వెంటనే ప్రకాశ్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రాంతీయవాదం, జాతీయ వాదం నేపథ్యంలోనే ఈ ఎన్నికలు సాగాయని పేర్కొంటూ… విష్ణు గెలుపును స్వాగతించారు. మా అసోసియేషన్ లో తన సభ్యత్వానికి ప్రకాష్ రాజ్ రాజీనామా చేస్తూ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ రాజీనామా ను తాను ఒప్పుకోనని మంచు విష్ణు ఇటీవల వెల్లడించారు. మా లో అందరం కలిసి ఐక్యతతో ముందుకు వెళ్ళాలి అంటూనే తనదైన శైలిలో విమర్శనాస్త్రాలు వేస్తున్నారు మంచు విష్ణు. ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.