Prakash Raj- Manchu Vishnu: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న మంచు విష్ణుని ఉద్దేశిస్తూ ప్రకాష్ రాజ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఎన్నికల హామీల్లో 90 శాతం నెరవేర్చామని మంచు విష్ణు ప్రకటించుకున్న నేపథ్యంలో ప్రకాష్ రాజ్ స్పందించారు. మా అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణమే ప్రధాన ఎజెండాగా మంచు విష్ణు అధ్యక్ష ఎన్నికలకు వెళ్లారు. ఇటీవల ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన ఆయన కొన్ని ప్రతిపాదనలు చేశారు. ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ కూల్చి కొత్తది నిర్మించి అందులో మా అసోసియేషన్ కోసం కొంత స్పేస్ తీసుకోవడం లేదా ఇక్కడ నుండి అరగంట ప్రయాణం చేస్తే ఒక స్థలం ఉంది. అక్కడ మా బిల్డింగ్ నిర్మించడమని వెల్లడించారు.

కొత్తగా నిర్మించిన ఫిల్మ్ ఛాంబర్ బిల్డింగ్ లోనే స్పేస్ తీసుకోవడం మంచిదని మెజారిటీ కమిటీ సభ్యులు అభిప్రాయం వెల్లడించారు. ఇదే మీటింగ్ లో మంచు విష్ణు ఎన్నికల హామీల్లో 90 శాతం నెరవేర్చినట్లు తెలియజేశారు. తాజాగా మంచు విష్ణు వ్యాఖ్యలపై ప్రకాష్ రాజ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ… 90 శాతం హామీలు నెరవేర్చామని మాటలు చెబితే సరిపోదు, అవి చేతల్లో చూపించాలి. మంచు విష్ణు ఎన్నికై ఏడాది పూర్తయింది. మరో ఏడాది సమయం మిగిలి ఉంది. కాబట్టి ఏం చేస్తాడో చూద్దామన్నారు. వచ్చే ఏడాది మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్న ప్రశ్నకు, ఇంకా సమయం ఉందిగా అప్పుడు ఆలోచిద్దామని ప్రకాష్ రాజ్ వెల్లడించారు.
గత ఏడాది జరిగిన మా అధ్యక్ష ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి. ప్రకాష్ రాజ్ – మంచు విష్ణు అధ్యక్ష బరిలో నిలిచారు. ప్రకాష్ రాజ్ కి మెగా ఫ్యామిలీ మద్దతు ప్రకటించింది. సూపర్ స్టార్ కృష్ణ, బాలకృష్ణ మంచు విష్ణు వెనుక నిలిచారు. ఈ క్రమంలో నాగబాబు, నరేష్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. జీవితా రాజశేఖర్, బండ్ల గణేష్, హేమ పలువురు ఒకరిపై మరొకరు వ్యక్తిగత ఆరోపణలు చేసుకుంటూ ఇండస్ట్రీ పరువు బజారుకీడ్చారు.

ప్రకాష్ రాజ్ నాన్ లోకల్ అనే నినాదం తీసుకొచ్చారు. ఎన్నికల రోజు కూడా హైడ్రామా నడిచింది. మొత్తంగా మంచు విష్ణు ప్రత్యర్థి ప్రకాష్ రాజ్ పై విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు, నిర్వహణపై ప్రకాష్ రాజ్ వర్గం అసహనం వ్యక్తం చేశారు. ప్రకాష్ రాజ్ ప్యానెల్ తరపున గెలిచిన సభ్యులు రాజీనామా చేశారు.నాగబాబు అయితే ఏకంగా మా సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.