
ఇదీ.. కొందరు నెటిజన్లు వేస్తున్న ప్రశ్న! ప్రస్తుతం చెన్నైలో ధనుష్ సినిమా షూటింగ్ బిజీలో ఉన్న ప్రకాష్ రాజ్.. చిత్రీకరణ సమయంలో గాయపడినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. చికిత్స కోసం ఆయన హైదరాబాద్ వస్తుండడంపై తమ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు. ఎందుకంటే.. ప్రకాష్ రాజ్ కు తగిలిన గాయాలు మరీ పెద్దవేమీ కాదన్నది ప్రధాన పాయింట్.
ధనుష్ సినిమా కోసం చెన్నై వెళ్లిన ప్రకాష్ రాజ్.. కొన్ని రోజులుగా అక్కడే ఉన్నారు. ఓ రిస్కీ షూట్ చేస్తున్న సమయంలోనే గాయాలైనట్టు ప్రకాష్ రాజ్ తెలిపారు. చేతికి, మరికొన్ని చోట్ల స్వల్ప గాయాలయ్యాయని, ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన చెప్పారు.
అయితే.. చేతికి చిన్న ఆపరేషన్ చేయించుకునేందుకు హైదరాబాద్ రాబోతున్నట్టు ప్రకటించారు. ఇక్కడ తన స్నేహితుడు డాక్టర్ గురవారెడ్డి ఆపరేషన్ చేస్తారని ప్రకాష్ రాజ్ తెలిపారు. ఇక్కడ కొందరు ప్రశ్నిస్తున్నారు. ఈ చిన్న గాయానికి హైదరాబాద్ వరకూ వచ్చి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉందా? అని సందేహం వ్యక్తం చేస్తున్నారు.
ఒకవేళ నిజంగానే గాయాలైనా.. హైదరాబాద్ కు రావడం వెనుక మా ఎన్నికల లక్ష్యం ఉండొచ్చని అంటున్నారు. టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల విషయమై ఎంత రచ్చ కొనసాగుతోందో తెలిసిందే. పైగా.. ముందుగానే ప్యానల్ ను ప్రకటించిన ఈ విలక్షణ నటుడు.. ఫేవరెట్ గా బరిలో ఉన్నారు. కాబట్టి.. చికిత్స చేయించుకొని చెన్నైలో ఉండే బదులు.. హైదరాబాద్ లోనే విశ్రాంతి తీసుకుంటే.. మా ఎన్నికలపైనా సమీక్షలు చేయొచ్చని భావించి ఉంటారనే అభిప్రాయం వ్యకమవుతోంది.
ఈ క్రమంలోనే కొందరు గాయాల్లో నిజమెంత అనే ప్రశ్నలు వేస్తున్నారు. అయితే.. ఈ ప్రశ్న అర్థం లేనిదిగా మరికొందరు కొట్టిపారేస్తున్నారు. మా ఎన్నికల గురించి రావడానికి ప్రకాష్ రాజ్ గాయాల వంక పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ఇందులో దాచుకోవాల్సిన అవసరం ఏముందని అడుగుతున్నారు.
అయితే.. తాజాగా హేమ చేసిన కామెంట్లతో మా వివాదం మరోస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రమశిక్షణ సంఘం నోటీసులు కూడా జారీచేసింది. మూడు రోజుల్లో సమాధానం చెప్పాలని హేమను ఆదేశించింది. ఈ పరిణామాల నేపథ్యంలో హైదరాబాద్ వస్తే.. గాయాలకు చికిత్స తీసుకోవడంతోపాటు మా ఎన్నికలపైనా చర్చించినట్టుగా ఉంటుందని ప్రకాష్ రాజ్ భావిస్తుండొచ్చని కొందరు అంటున్నారు.