మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నిక ఎన్నడూ లేనంత రసాభాసగా మారుతోంది ఈ సారి. పోలింగ్ కు ఇంకా మూడు మాసాల సమయం ఉంది. అయినా.. ఇప్పటి నుంచే ప్యానళ్లు ప్రకటించడం మొదలు.. కార్యాచరణ సిద్ధం చేయడం సినీపరిశ్రమనే కాదు.. సాధారణ జనాన్ని కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇండస్ట్రీలో ఉన్న ఆధిపత్యపోరే.. మా ఎన్నికల రూపంలో తెరపైకి వచ్చిందని అంటున్నారు. ఏకగ్రీవం చేయాలని పెద్దలు ప్రయత్నించినా.. కుదరకపోవడానికి కారణం ఇదేనని అంటున్నారు.
దాదాపుగా పోటీ అనివార్యం అని అంటున్నారు. అయితే.. మొదటగా ద్విముఖ పోరే అనుకున్నప్పటికీ.. ఆ తర్వాత వరుసగా మేము సైతం.. అంటూ ఒక్కొక్కరూ వచ్చేశారు. ప్రస్తుతానికైతే ఐదారుగురు బరిలో నిలుస్తామని చెబుతున్నారు. ఎన్నికల నాటికి ఇంకా ఎంత మంది లైన్లోకి వస్తారో చెప్పలేం. అయితే.. ప్రధాన పోటీ మాత్రం.. ప్రకాశ్ రాజ్ – మంచు విష్ణు మధ్యనే ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. వీరిలోనూ ప్రకాశ్ రాజ్ కే గెలుపు ఛాన్స్ ఎక్కువ అని అంటున్నారు. కారణం.. మెగా క్యాంప్ అండగా ఉండడమే! మా ఎన్నికల్లో మెగా మద్దతు ఉన్నవారిదే గెలుపు అన్నట్టుగా వస్తోంది. ఈ సారికూడా అదే జరగొచ్చని అంటున్నారు.
అయితే.. గెలుపే ప్రధానమైన చోట.. ప్రత్యర్థుల లూప్ హోల్స్ వెతకడం సహజం. వాటిని టార్గెట్ చేసి, విమర్శలు గుప్పించడం అత్యంత సహజం. అలా చూసుకున్నప్పుడు ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అనే వాదన వినిపించారు. కానీ.. ఈ పాచిక పెద్దగా పారినట్టులేదు. కళాకారుడికి ఎల్లలు ఉండవు అని, భారతీయులంతా లోకలే అని ఆర్జీవీ నుంచి సుమన్ దాకా అందరూ అన్నారు. దీంతో.. మరికొన్ని పాయింట్లు లాగుతున్నట్టు సమాచారం.
దాదాపు 20 ఏళ్లుగా మా లో సభ్యత్వం ఉన్న ప్రకాష్ రాజ్.. ఇంతకు ముందెన్నడూ ‘మా’ను పట్టించుకోలేదని అంటున్నారు. కార్యక్రమాలకు హాజరుకాకపోవడంతోపాటు కనీసం ఓటు హక్కు కూడా వినియోగించుకోలేదని అంటున్నారు ప్రత్యర్థులు. మరి, ఇప్పుడు అధ్యక్షుడు ఎలా అవుతారని అడుగుతున్నారు. ఇక, షూటింగుకు సమయానికి రారని చెబుతున్నారు. ఈ కారణంగానే గతంలో.. టాలీవుడ్ ప్రకాష్ రాజ్ ను బ్యాన్ కూడా చేసింది. చిరంజీవి వంటివారు కల్పించుకొని సర్దిచెప్పారు. ఇవేకాకుండా.. ఆయన రాజకీయంగా బీజేపీ గురించి మాట్లాడిన హిందూ వ్యతిరేక వ్యాఖ్యలను కూడా.. సంబంధం లేని మా ఎన్నికల్లో వాడుకునేందుకు చూస్తున్నారు ప్రత్యర్థులు. అంతేకాదు.. ఆయన పర్సనల్ లైఫ్ ను సైతం గెలికేసి, భార్యకు విడాకులు ఇచ్చాడని, మహిళలపై గౌరవం లేదని అంటున్నారు. ఈ విధమైనవి డ్రాబ్యాక్స్ గా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారు.
అయితే.. మెగా కాంపౌండ్ ఫుల్ సపోర్టుగా ఉండడం, తెలంగాణలోని రెండు గ్రామాలను దత్తత తీసుకొని, ఆయన చేసిన సేవలు ప్రకాష్ రాజ్ కు అండగా ఉన్నాయి. కాబట్టి.. గెలుపు దక్కే ఛాన్స్ ఈ విలక్షణ నటుడికే అని కూడా కొందరు అంటున్నారు. రాబోయే సెప్టెంబరులో ఎన్నికలు జరగనున్నాయి. మరి, ఫలితం ఎలా వస్తుందో చూడాలి.