Pradeep Ranganathan: స్టార్ హీరోల వారసులుగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుండి సినిమాలు తీస్తున్నప్పటికీ సాధించని అరుదైన రికార్డు ని తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్(Pradeep Ranganathan) సాధించాడు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా, ఒక సాధారణ యువకుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ఈ ప్రదీప్ రంగనాథన్, ఇప్పుడు తెలుగు, తమిళ భాషలకు సంబంధించిన యూత్ ఆడియన్స్ లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. ఆయన హీరో గా నటించిన ‘లవ్ టుడే’, ‘డ్రాగన్’ చిత్రాలు కమర్షియల్ సూపర్ హిట్స్ గా నిలిచి చెరో వంద కోట్ల గ్రాస్ మార్కుని అందుకున్నాయి. ఇక రీసెంట్ గా ఆయన హీరో గా నటించిన ‘డ్యూడ్’ చిత్రం మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఈ చిత్రం 5 రోజుల్లో 80 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను సాధించి సెన్సేషన్ సృష్టించింది.
ట్రేడ్ లెక్కల్లో ఈ చిత్రం 80 కోట్లు మాత్రమే రాబట్టింది. కానీ నిర్మాతలు మాత్రం ఈ చిత్రం 5 రోజుల్లో 95 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్టు ఒక పోస్టర్ ని విడుదల చేశారు. కానీ ట్రేడ్ లెక్కల్లో మాత్రం ఈ వీకెండ్ కి ఈ చిత్రం 100 కోట్ల మార్కుని అందుకుంటుందని అంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా వచ్చిన ఒక కుర్రాడికి ఈ రేంజ్ లో సక్సెస్ రావడం అనేది సాధారణమైన విషయం కాదు. మన టాలీవుడ్ లో ఎప్పటి నుండో ఉన్న అక్కినేని నాగచైతన్య, నాని, విజయ్ దేవరకొండ వంటి హీరోలు రీసెంట్ గానే ఈ మార్కుని వరుసగా అందుకున్నారు. అలాంటి నిన్న గాక మొన్న వచ్చిన ఈ కుర్ర హీరో, వరుసగా మూడు సార్లు వంద కోట్ల మార్కుని అందుకోవడం అనేది ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు.
ఇలా మన టాలీవుడ్ లో ఒకప్పుడు ఉదయ్ కిరణ్ కి మాత్రం ఇలాంటి సక్సెస్ వచ్చింది. ఆయన హీరో గా నటించిన మొదటి మూడు సినిమాలు అప్పట్లో ఒక ప్రభంజనం. ఇండస్ట్రీ లో ఒక హాట్ టాపిక్ గా మారిపోయాడు. ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కూడా సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఒక హాట్ టాపిక్ గా మారాడు. భవిష్యత్తులో ఆయన ఇదే తరహా సినిమాలు చేస్తూ పోతే కచ్చితంగా పెద్ద స్టార్ హీరోగా మారిపోతాడు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ చిత్రం తర్వాత ప్రదీప్ నుండి రాబోతున్న ‘LIK’ చిత్రం పై కూడా ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని బలమైన నమ్మకం తో ఉన్నారు ట్రేడ్ పండితులు.