Kannappa : మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని సుమారుగా 200 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న చిత్రం ‘కన్నప్ప’. తనకి టాలీవుడ్ లో ఎలాంటి మార్కెట్ లేకపోయినప్పటికీ, ఇంత బడ్జెట్ పెట్టి ఆడియన్స్ కి ఒక కొత్త అనుభూతిని ఇవ్వాలని అనుకోవడం పెద్ద సాహసమే అని చెప్పాలి. దానికి తోడు మంచు విష్ణు అడిగిన వెంటనే ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లాంటి సూపర్ స్టార్స్ అందరూ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించడానికి ఒప్పుకోవడం అనేది చిన్న విషయం కాదు. మోహన్ బాబు, విష్ణు లకు వాళ్ళ వద్ద ఉన్న గౌరవం, అభిమానం ఎలాంటిదో ఈ ఒక్క ఉదాహరణ చూసి అర్థం చేసుకోవచ్చు. ఈ సినిమాకి సంబంధించిన టీజర్ తో పాటు, అందరూ ఫస్ట్ లుక్ పోస్టర్స్ విడుదలయ్యాయి, ఒక్క ప్రభాస్ ఫస్ట్ లుక్ తప్ప.
తమ అభిమాన హీరో లుక్ ఎలా ఉంటుందో అని ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ళ ఎదురు చూపులకు తెరదించుతూ ప్రభాస్ ఫస్ట్ లుక్ ని ఫిబ్రవరి 3వ తేదీన విడుదల చేయబోతున్నట్టు కాసేపటి క్రితమే ఒక చిన్న గ్లిమ్స్ పోస్టర్ ద్వారా మూవీ టీం అధికారిక ప్రకటన చేసింది. ఈ గ్లిమ్స్ పోస్టర్ లో ప్రభాస్ కళ్ళు మాత్రమే చూపించారు. అయితే ఇందులో ప్రభాస్ మహాశివుడి క్యారక్టర్ చేస్తున్నాడని ముందుగా అనుకున్నారు. కానీ ఆ క్యారక్టర్ బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ చేస్తున్నట్టు అధికారికంగా మొన్న ఫస్ట్ లుక్ పోస్టర్ ద్వారానే తెలిపారు. మరి ప్రభాస్ ఏ క్యారక్టర్ చేస్తున్నాడు అనే దానిపై ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఎందుకంటే గ్లిమ్స్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ చూస్తే మహాశివుడి క్యారక్టర్ చూస్తున్నట్టుగానే ఉంది. అదేవిధంగా కొంతకాలం క్రితమే ప్రభాస్ లుక్ సోషల్ మీడియా లో లీక్ అయ్యింది.
ఈ లుక్ కూడా శివుడి క్యారక్టర్ ని పోలి ఉంది. మూవీ టీం కూడా ప్రభాస్ గ్లిమ్స్ పోస్టర్ ని విడుదల చేస్తూ ‘హర హర మహాదేవ్’ అని సంబోధించారు. ఇక్కడే అభిమానులు అయ్యోమయ్యం కి గురి అవుతున్నారు. ప్రభాస్ రేంజ్ కి దేవుడి క్యారక్టర్ చేయాలి. అది తప్ప ఇంకా ఏ క్యారక్టర్ చేసినా ఆయన స్థాయిని తగ్గించినట్టే అవుతుంది. అనేక మంది ప్రభాస్ నందీశ్వరుడి క్యారక్టర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఫిబ్రవరి మూడవ రోజున ప్రభాస్ క్యారక్టర్ ఏమిటి అనే దానిపై స్పష్టత ఉంటుంది. అప్పటి వరకు ఓపిక పట్టాల్సిందే. పాన్ ఇండియా లెవెల్ లో అన్ని ప్రాంతీయ భాషల్లో ఈ చిత్రం ఏప్రిల్ 25 న విడుదల కాబోతుంది. మరి ఈ చిత్రం విష్ణు జాతకాన్ని మారుస్తుందా లేదా అనేది చూడాలి.