
బాహుబలి మూవీతో మన రెబల్ స్టార్ స్టామినా ప్రపంచానికి తెలిసింది. బాహుబలి సిరీస్ తర్వాత ‘సాహో’ అనిపించే ప్రయత్నం చేసిన ప్రభాస్ సినిమా గురించి ఎలాంటి విషయం అయినా నేషనల్ వైడ్ టాపిక్ అవుతోంది. తనతో పని చేయడానికి ఎంతో మంది దర్శకులు ఎదురుచూస్తున్నా.. రెబల్ స్టార్ మాత్రం కథల ఎంపికలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంటాడు. బాహుబలి సెట్స్ మీద ఉండగానే సాహోకు ఓకే చెప్పిన ప్రభాస్.. ఇప్పుడు రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నాడు. కరోనా ప్రభావం లేకపోయి ఉంటే ఈ సినిమా ఇప్పటికే చివరి దశకు వచ్చి ఉండేది. ఈ సినిమా తర్వాత ‘మహానటి’ ఫేం నాగ్ అశ్విన్‌తో సినిమా చేయనున్నాడు ప్రభాస్. ఈ చిత్రంలో రెబల్ స్టార్ దేవుడిగా కనిపిస్తాడని టాలీవుడ్ టాక్.
నాగ్ అశ్విన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్లకముందే మరో పాన్ ఇండియా డైరెక్టర్ కు ప్రభాస్ ఓకే చెప్పాడన్న వార్త చక్కర్లు కొడుతోంది. ఆ డైరెక్టర్ ఎవరో కాదు కేజీఎఫ్ తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్. ప్రస్తుతం కేజీఎఫ్ రెండో పార్ట్ తో బిజీగా ఉన్న నీల్.. ఇప్పటికే ప్రభాస్‌కు కథ చెప్పగా అతను సరే అన్నట్టు టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రశాంత్, ప్రభాస్ కాంబోకు డీవీవీ దానయ్య ప్రొడ్యూసర్ అని తెలుస్తోంది. దీనికి బలం చేకూరుస్తూ ప్రశాంత్ బర్త్ డే సందర్భంగా డీడీవీ సంస్థ ‘మీ శైలిలో మీరు ఇండియన్ పరిధులు దాటి ముందుకెళ్లాలని ఆశిస్తున్నాం’ అని శుభాకాంక్షలు తెలిపింది. మరో విశేషం ఏమిటంటే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో జూనియర్ ఎన్టీఆర్ తో కూడా ప్రశాంత్ నీల్ ఓ సినిమా చేస్తున్నాడు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రం తర్వాత నీల్.. ప్రభాస్‌తో మూవీ చేసే అవకాశం ఉందట.