
తెలంగాణ నీళ్లను తరలించుకు పోయేందుకు కడుతున్న పోతిరెడ్డి ప్రాజెక్టును ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తక్షణమే నిలిపివేయకుండా హైదరాబాద్లో తిరగనివ్వబోమని ఓయూ నేతలు స్పష్టం చేశారు. శుక్రవారం ఓయూ జేఏసీ ఆధ్వర్యంలో కృష్ణానదీ యాజమాన్య బోర్డు చైర్మన్ పరమేశంకు వినతిప్రతం సమర్పించారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నేతలు కల్వకర్తి ఆంజనేయులు, మాళిగ లింగస్వామిలు కేసీఆర్, జగన్మోహర్ రెడ్డిలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గోదావరి నీటిని ఉత్తర తెలంగాణకు, కృష్ణా నీటిని రాయలసీమకు తరలించుకుపోతే దక్షిణ తెలంగాణ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంటే కేసీఆర్ ఫౌమ్ హౌజ్ లో పడుకున్నారంటూ ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరులో కుర్చీ వేసుకొని ప్రాజెక్టు పూర్తి చేస్తానని చెప్పారని అన్నారు. మరీ ఇప్పుడు దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుంటే ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రా లేక ఉత్తర తెలంగాణకే ముఖ్యమంత్రో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ప్రాంత ప్రజాప్రతినిధులంతా కేసీఆర్ కు తొత్తులుగా వ్యవహరించడం వల్లే దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీ ఒక డ్రామా పార్టీగా మారిందంటూ ఓయూ జేఏసీ నేతలు ఫైరయ్యారు.
పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణాన్ని టీఆర్ఎస్ నేతలు అడ్డుకోకపోతే వారికి బయట తిరిగనిచ్చేది లేదని స్పష్టం చేశారు. ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతామంటూ హెచ్చరించారు. ఏపీ ప్రభుత్వం పోతిరెడ్డి ప్రాజెక్టు నిర్మాణం కోసం జారీ చేసిన 203 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. లేకపోతే జగన్మోహన్ రెడ్డిని హైదరాబాద్లో తిరగనిచ్చేది లేదన్నారు ఇప్పటికైనా కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసి దక్షిణ తెలంగాణను అభివృద్ధి చేయాలని కోరారు.