
ఇవాళ టాలీవుడ్ లెజండరీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు. రెండు రోజుల ముందే మొదలైన మెగా బర్త్ డే ఈవెంట్స్.. ఇవాళ తారస్థాయికి చేరుకున్నాయి. ‘‘హ్యాపీ బర్త్ డే మెగాస్టార్’’ అనే పదంతో సోషల్ మీడియా షేకై పోయింది. సోషల్ మీడియాలో చిరంజీవి అనే పేరు టాప్ ట్రెండింగ్ లో నిలిచింది. టాలీవుడ్ స్టార్లు, సెలబ్రిటీలు మొదలు.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానుల వరకు శుభాకాంక్షలు తెలపడంతో.. సామాజిక మాధ్యమాలన్నీ హోరెత్తిపోయాయి. అయితే.. సోదరు పవన్ కల్యాణ్ చెప్పిన మెగా గ్రీటింగ్స్ అందరినీ ఆకర్షిస్తోంది. అన్నపై తనకున్న ప్రేమను భావోద్వేగంగా పంచుకున్నారు పవర్ స్టార్.
‘‘మెగాస్టార్ చిరంజీవి నాకే కాదు.. ఎందరికో మార్గదర్శి, మరెందరికో స్ఫూర్తి ప్రదాత. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా.. కొన్ని మిగిలే ఉంటాయి. ఆయనకు తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం. ఆయనలోని సుగుణాలను చూస్తూ పెరగడం మరో అదృష్టం. నాకు అన్నగా జన్మించినా.. తండ్రిలా నన్ను పెంచారు. అన్నయ్యను ఆరాధించే లక్షలాది మందిలో నేను తొలి స్థానంలో ఉంటాను.’’ అంటూ.. తన ప్రేమను చాటుకున్నారు పవన్ కల్యాణ్.
ఇంకా చిరు గురించి వివరిస్తూ… ‘‘చిరంజీవి అసామాన్యుడిగా ఎదిగిన సామాన్యుడు. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండడం ఆయనలోని అద్భుత లక్షణం. భారతీయ సినీ యవనికపై తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నప్పటికీ.. ఏనాడూ గర్వాన్ని ప్రదర్శించలేదు. పద్మభూషణ్ పురస్కారంతోపాటు ఎంపీ, కేంద్ర మంత్రి పదవులు అందుకున్నా.. ఎక్కడా తల ఎగరేయలేదు. చిరంజీవిని లక్షలాది కుటుంబాలు తమ సభ్యుడిగా భావించడానికి కారణం ఇదే’’ అన్నారు పవర్ స్టార్.
ఇక, చిరంజీవి సేవాగుణం గురించి కూడా పవన్ ప్రస్తావించారు. ‘‘విద్యార్థిగా ఉన్నప్పటి నుంచే సేవా గుణం ఆయనకు అలవడింది. అయితే.. అత్యున్నత శిఖరాలను అందుకున్న తర్వాత కూడా దాన్ని కొనసాగిస్తున్నారు. బ్లడ్ బ్యాంక్, ఆక్సీజన్ బ్యాంక్ వంటివి ఏర్పాటు చేసి.. ఆపదలో ఉన్న ఎంతో మందిని ఆదుకున్నారు. గుప్తదానాలు ఎన్నో చేశారు. చేస్తున్నారు’’ అని పవన్ తెలిపారు.