Posani Krishna Murali: ప్రముఖ సినీ నటుడు, వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali) అరెస్ట్ అయ్యి దాదాపుగా 14 రోజులు పూర్తి అయ్యింది. సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan), మినిస్టర్ నారా లోకేష్(Nara Lokesh) లను గత ఐదేళ్లు వైసీపీ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు ఇష్టమొచ్చినట్టు తిట్టి, ఇంట్లో ఆడవాళ్లను కూడా వదలకుండా అమానుషంగా మాట్లాడినందుకు ఆయనని అరెస్ట్ చేసి రైల్వే కోడూరు కోర్టు లో హాజరు పరిచారు. అక్కడ 14 రోజుల రిమాండ్ విధించగా, పీటీ వారెంట్ తో నరసారావుపేట, ఆ తర్వాత కర్నూల్ కి తరలించారు. నిన్న ఆయనపై నమోదైన కేసులకు బెయిల్ లభించగా, ఈరోజు గుంటూరు పోలీసులు మరో కేసు మీద ఆయన్ని పీటీ వారెంట్ తో అరెస్ట్ చేసి గుంటూరు కి తరలించారు. కాసేపటి క్రితమే విచారణ జరిపిన గుంటూరు కోర్టు, పోసాని కి ఈ నెల 26 వ తేదీ వరకు రిమాండ్ విధించింది.
అయితే పోసాని జడ్జి వద్ద చాలా వరకు మొరపెట్టుకున్నాడు. తనకు బెయిల్ మంజూరు చేయాల్సిందిగా ప్రాధేయపడ్డాడు. ‘నాకు బెయిల్ మంజూరు చేయకపోతే, నా ప్రాణాలను నేనే తీసేసుకుంటాను. నేను ఈ నరకం అనుభవించలేకపోతున్నాను’ అంటూ బోరుమని ఏడ్చాడు. తనకు ఇటీవలే రెండు సార్లు గుండెకు ఆపరేషన్ జరిగిందని, గుండెలో ఒక స్టంట్ కూడా వేశారని, దయచేసి నా మీద జాలి చూపండి అని వేడుకున్నాడు. కానీ జడ్జి మాత్రం అతని అభ్యర్థనను పట్టించుకోలేదు. 14 రోజుల పాటు రిమాండ్ ని విధించింది. ఈ 14 రోజుల తర్వాత మళ్ళీ ఏ కొత్త కేసు వస్తుందో, మళ్ళీ ఎన్ని రోజులు జైలు జీవితం గడపాలో అంటూ పోసాని కృష్ణ మురళి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆయనపై దాదాపుగా 16 కేసులు నమోదు అయ్యాయి. ఈ కేసులన్నిటికీ ఆయన రిమాండ్ లో గడిపి వచ్చేలా ఉన్నాడు. ఆయనపై పోక్సో చట్టం క్రింద కేసు నమోదైన ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకవేళ అదే జరిగితే పోసాని కి ఇక బెయిల్ రావడం కూడా కష్టమే.