Prudhvi Raj Illness: కమెడియన్ పృథ్వి అస్వస్థతకు గురయ్యారు. ఆసుపత్రి బెడ్ పై దీన స్థితిలో పడుకొని ఉన్న పృథ్వి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. విషయంలోకి వెళితే… పృథ్వి డైరెక్టర్ అవతారం ఎత్తారు. ఆయన ‘కొత్త రంగుల ప్రపంచం’ టైటిల్ తో ఓ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ లో ఆయన అనారోగ్యానికి గురయ్యారు. వెంటనే యూనిట్ స్థానిక ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదు. ఆయన కండిషన్ నార్మల్ గా ఉందని వైద్యులు చెప్పినట్లు సమాచారం.
ఆసుపత్రి బెడ్ పై నుండి 30 ఇయర్స్ పృథ్వి ఓ సందేశం పంచుకున్నారు. ఫస్ట్ టైం ఒక చిత్రానికి డైరెక్ట్ చేస్తున్నాను. మీ ఆశీస్సులు కావాలి. కొత్త రంగుల ప్రపంచం కోసం ఈ నెలలో ఓ భారీ ఈవెంట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నాము. నేను అనారోగ్యానికి గురయ్యాను. సెలైన్ పెట్టారు. అయినా సినిమా గురించే ఆలోచిస్తున్నాను… అంటూ పృథ్వి చెప్పుకొచ్చారు. పృథ్వి అభిమానులు ఒకింత కంగారు పడుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.
పృథ్వి సీనియర్ నటుడిగా వందల చిత్రాల్లో నటించారు. విలన్, కమెడియన్, క్యారెక్టర్ రోల్స్ చేశారు. ’30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడా’ డైలాగ్ తో ఫేమస్ అయ్యాడు. పృథ్వి కూతురు కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తుంది. నటుడిగా రాణిస్తున్న పృథ్వి దర్శకుడిగా మారారు. కొత్త రంగుల ప్రపంచం చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. దర్శకుడిగా ఆయన మొదటి ప్రయత్నం ఎలాంటి ఫలితం ఇస్తుందో చూడాలి.
మరోవైపు పృథ్వి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన వైసీపీ పార్టీకి మద్దతుగా నిలిచారు. ఆ పార్టీ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అందుకు ప్రతిఫలంగా వైసీపీ ప్రభుత్వం ఆయనకు ఎస్వీబీసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. అయితే కొన్నాళ్లకే ఆయన లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్నారు. దీంతో ఆయన్ని పదవి నుండి తప్పించారు. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో చేరారు.