Pooja : టాలీవుడ్ నుండి బాలీవుడ్ కి ఎగుమతి అయిన హీరోయిన్స్ లో ఒకరు పూజ హెగ్డే. ఈమెకు సౌత్ ఇండియా లో ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. హిట్స్, ఫ్లాప్స్ అతీతంగా ఈమెకి అవకాశాలు వస్తుంటాయి. కానీ ఈమధ్య ఆమె ఎక్కువ బాలీవుడ్ పై ఫోకస్ పెట్టడం, రెమ్యూనరేషన్ కూడా భారీగా పెంచేయడంతో నిర్మాతలు ఆమెని తమ సినిమాల్లో తీసుకోవడం తగ్గించేశారు. చాలా కాలం తర్వాత ఇప్పుడు ఆమె తమిళం లో విజయ్ ఆఖరి చిత్రం ‘జన నాయగన్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. తెలుగు లో సూపర్ హిట్ గా నిల్చిన నందమూరి బాలకృష్ణ ‘భగవంత్ కేసరి’ చిత్రానికి ఇది రీమేక్. అదే విధంగా రీసెంట్ గా ఆమె బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ తో కలిసి నటించిన ‘దేవా’ చిత్రం భారీ అంచనాల నడుమ విడుదలైంది.
విడుదలకు ముందు ఎన్నో ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె, అందులో భాగంగా మూవీ టీం ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నలకు కాస్త అసహనానికి గురైంది. ముందుగా రిపోర్టర్ ఆమెని ఒక ప్రశ్న అడుగుతూ ‘బాలీవుడ్ లో స్టార్ హీరోల పక్కన సినిమా అవకాశాలు రావడం అనేది ఒక అదృష్టం గా భావిస్తుంటారు హీరోయిన్స్. అలాంటిది మీరు సల్మాన్ ఖాన్, హ్రితిక్ రోషన్, అక్షయ్ కుమార్, రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ లాంటి స్టార్స్ తో కలిసి సినిమాలు చేశారు. దీనిని మీరు అదృష్టంగా భావిస్తున్నారా?, ఆ చిత్రాల్లో నటించడానికి మీరు అర్హులని అనుకుంటున్నారా? ‘ అని అడుగుతాడు. దానికి ఆమె సమాధానం చెప్తూ ‘నేను అర్హత గల హీరోయిన్ ని కాబట్టే వాళ్ళు నన్ను ఆ సినిమాలకు ఎంచుకున్నారు. నాకు వచ్చిన ఆ అవకాశాన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకుంటూ నూటికి నూరు శాతం న్యాయం చేయగలిగితేనే నేను అదృష్టం గా భావిస్తాను. ఒకవేళ మీరు నాకు కేవలం అదృష్టం వల్లే అవకాశాలు వస్తున్నాయి అనుకుంటే, అనుకోండి నాకేమి పర్వాలేదు’ అంటూ అసహనంతో సమాధానం చెప్తుంది.
రిపోర్టర్ మాట్లాడుతూ ‘మీరు సినిమాలను అసలు ఎలా ఎంచుకుంటారు..? కేవలం స్టార్ హీరోలైతేనే సినిమాలు ఒప్పుకుంటారా?’ అని అడగగా, దానికి ఆమె సమాధానం చెప్తూ ‘అసలు మీ సమస్య ఏమిటి?’ అని కోపంగా బదులిస్తుంది. పరిస్థితులు చెయ్యి జారిపోవడాన్ని గమనించిన హీరో షాహిద్ కపూర్ మధ్యలో కలగచేసుకొని జోక్ వేసి కవర్ చేసాడు. ఇది ఇప్పుడు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ వీడియోని చూసిన మన నెటిజెన్స్, లక్షణంగా మన టాలీవుడ్ లో క్రేజీ సినిమాలు చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఉండేదానివి, బాలీవుడ్ కి వెళ్లి ఇన్ని అవమానాలు భరించాల్సిన అవసరం ఏమిటి నీకు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో ఒక్క టాలీవుడ్ చిత్రం కూడా లేకపోవడం గమనార్హం.